: గోదావరి గలగల... కృష్ణమ్మ విలవిల!
మహారాష్ట్రతో పాటు ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఒకవైపు గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తుంటే, మరోవైపు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యంగా రాయలసీమతో పాటు గుంటూరు, ప్రకాశం జిల్లాల వరప్రదాయిని కృష్ణా నది వెలవెలబోతోంది. భారీ వర్షాలతో గోదావరికి ఉపనదులైన ప్రాణహిత, పెన్ గంగా, శబరి తదితర చిన్న నదులు భారీ వరదలతో ప్రవహిస్తున్నాయి. దీంతో రాజమండ్రి వద్ద గోదావరిలో నీటి ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 51.04 అడుగులకు చేరగా, ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 12.1 అడుగుల నీటిమట్టం నమోదైంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసిన అధికారులు, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. బ్యారేజ్ నుంచి 10.91 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేసినట్టు ప్రకటించారు. ఈ సాయంత్రానికి వరద నీటి ప్రవాహం 13 లక్షల క్యూసెక్కులకు చేరవచ్చని అంచనా వేస్తున్నట్టు సర్కిల్ ఎస్ఈ రాంబాబు పేర్కొన్నారు. ఈ నీటినంతా సముద్రంలోకి వదిలి వేయనున్నట్టు తెలిపారు. కాగా, భారీ వర్షాలకు తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం వద్ద దంగేడు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శబరి నది ఉప్పొంగుతుండటంతో పోలవరం మండలంలోని 10 గ్రామాలకు రవాణా వ్యవస్థ స్తంభించింది. ఇదిలావుండగా, కర్ణాటకలో నైరుతి రుతుపవనాల ప్రభావం ఏమాత్రం సంతృప్తికరంగా లేదు. ఇప్పటికే నిండుకుండలా ఉండాల్సిన ఆల్మట్టి డ్యామ్ కే దాదాపు 80 టీఎంసీల నీరు కావాల్సి వుంది. పైనుంచి నీటి విడుదల లేకపోవడంతో కృష్ణానదిపై ఉన్న జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు ఇంకా డెడ్ స్టోరేజ్ నుంచి గట్టెక్కలేదు.