: ‘నిర్భయ’ దోషుల ‘మరణశిక్ష’ పిటిషన్‌.. పనివేళలు ముగిశాక విచారించాలని సుప్రీంకోర్టు నిర్ణయం


నిర్భయ అత్యాచార ఘటన కేసులో ఉరిశిక్షకు వ్యతిరేకంగా దోషులు దాఖలు చేసుకున్న పిటిషన్‌ను పనివేళలు ముగిశాక విచారించాలని అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించింది. ఈనెల 18 నుంచి ఆ పిటిషన్‌ను విచారించాలని జస్టిస్ దీపక్ మిశ్రా అధ్యక్షతన కూడిన ధర్మాసనం నిర్ణయించింది. ప్రతీ సోమ, శుక్రవారాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు విచారించనున్నట్టు పేర్కొంది. కోర్టు పనివేళలు నాలుగు గంటలకే ముగియనుండగా అదనంగా మరో రెండు గంటలు విచారణ కోసం కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. రోజంతా విచారించడం ద్వారా తీర్పు త్వరగా వచ్చే వీలుందన్న అడ్వకేట్ సంజయ్ హెడ్గే వ్యాఖ్యల నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరణశిక్ష పడిన వినయ్ శర్మ(23), అక్షయ్ ఠాకూర్(31) కేసులను సంజయ్ హెడ్గే వాదిస్తుండగా ముకేశ్(29), పవన్ గుప్తా(22) కేసులను రామచంద్రన్ వాదిస్తున్నారు. ‘నిర్భయ’ కేసులో ట్రయల్ కోర్టు విధించిన మరణశిక్షపై నలుగురు నిందితులు మార్చి 13, 2014లో హైకోర్టును ఆశ్రయించగా కోర్టు మరణశిక్షను సమర్థించిన విషయం తెలిసిందే. దీంతో వీరు ఉరిశిక్షకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వైద్య విద్యార్థినిపై డిసెంబరు 16, 2012లో ఆరుగురు వ్యక్తులు కలిసి అత్యంత దారుణంగా అత్యాచారం చేసి, ఆపై బస్సు నుంచి కిందికి విసిరేశారు. మూడు రోజుల తర్వాత బాధితురాలు సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

  • Loading...

More Telugu News