: భార్యను కలిసేందుకు ఆడవేషం వేసి బుక్కయిపోయిన భర్త!
భార్యను కలిసేందుకు వేషం మార్చిన భర్తకు పరాభవం ఎదురైన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...తమిళనాడులోని విల్లుపురంకి చెందిన శేఖర్ కు ఇంద్రా అనే మహిళతో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. సింగపూర్ లో ఉద్యోగం చేసుకుంటున్న శేఖర్ ఇటీవల హఠాత్తుగా భారత్ కు వచ్చేశాడు. దీనిపై అతని అత్త ఆగ్రహం వ్యక్తం చేసి, అతని నుంచి తన కుమార్తెను ఇంటికి తెచ్చేసుకుంది. దీంతో ఇంద్రా రెండు నెలలుగా పుట్టింట్లోనే ఉంటోంది. భార్య ఎడబాటును భరించలేని శేఖర్, ఆమెను కలసి వాస్తవాలపై చర్చించాలని నిర్ణయించుకున్నాడు. అల్లుడిగా వెళ్తే తన అత్త భార్యను కలవనీయదని భావించి, ఆడవేషం వేశాడు. అలాగే వెళ్లి భార్యను బయటకు రప్పించాడు. ఆమెతో మాట్లాడుతుండగా ఆడవేషంలో ఉన్న శేఖర్ మగవారు ధరించే చెప్పులు వేసుకుని ఉండడాన్ని చుట్టుపక్కల వారు గుర్తించారు. శేఖర్ ను చిన్నపిల్లల్ని ఎత్తుకుపోయే దొంగగా అనుమానించారు. వెంటనే రెండు తగిలించి, అతనిని స్థానిక పోలీసులకు అప్పగించారు. దీంతో లబోదిబోమన్న శేఖర్ ను విచారించిన పోలీసులు అసలు విషయం తెలుసుకుని నవ్వుకున్నారు.