: ఏం చేయాలో... ఎలా చేయాలో మాకు తెలుసు...నీతులు చెప్పద్దు!: పాక్ కు కేంద్రమంత్రి ఘాటు సమాధానం
పాకిస్థాన్ కు కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు ఘాటు సమాధానమిచ్చారు. కాశ్మీర్ లో చోటుచేసుకున్న హింస గురించి పాకిస్థాన్ ప్రధాని కార్యాలయం వరుసగా ట్వీట్లు సంధించడంపై స్పందించిన కేంద్ర మంత్రి మాట్లాడుతూ, కాశ్మీర్ ఆందోళనలు భారత్ అంతర్గత వ్యవహారం అని తేల్చిచెప్పారు. ఇందులో పాక్ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆ విషయాన్ని ఆయన సూటిగా, కాస్త కరకుగా చెప్పారు. ఇంకా బాధపడాలనుకుంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో జరుగుతున్న హక్కుల ఉల్లంఘనపై ఆందోళన, ఆవేదన వ్యక్తం చేయాలని ఆయన పాక్ కు సూచించారు. ఆందోళనలను ఎలా చల్లబరచాలో తమకు తెలుసని ఆయన అన్నారు. తమకు పాఠాలు చెప్పే ప్రయత్నం చేయవద్దని ఆయన పాక్ కు హితవు పలికారు.