: జైలు అధికారి నిర్వాకం... మహిళా ఖైదీ 'తల్లి' అవుతోంది!
కోర్టు ఓ కుటుంబానికి శిక్ష విధించి జైలుకు పంపిస్తే... అక్కడి జైలు అధికారి ఓ యువతికి మరింత పెద్ద శిక్ష విధించి, తల్లిని చేశాడు. వివరాల్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్ లోని జౌన్ పూర్ సమీపంలోని ఓ గ్రామంలో బంధువులతో జరిగిన ఆస్తి తగాదాలతో ఓ కుటుంబం మొత్తానికి శిక్ష పడింది. దీంతో తండ్రి, ఇద్దరు కుమార్తెలు జౌన్ పూర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. తండ్రికి ఈ మధ్యే బెయిల్ మంజూరైంది. దీంతో ఆయన నేరుగా తన కుమార్తెలను కలిసేందుకు జైలుకి వెళ్లాడు. అక్కడ తన 21 ఏళ్ల అవివాహితైన కుమార్తెను చూసి షాక్ తిన్నాడు. వివరాలు కనుక్కోగా సీనియర్ జైలు అధికారి పైశాచికత్వం కారణంగా ఆమె 34 వారాల గర్భవతి అని తెలిసింది. దీంతో ఆయన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు ఆయనను సస్పెండ్ చేశారు. ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీంతో ఈ ఘటన మనదేశ జైళ్ల తీరును కళ్లకు కడుతోందని ఆరోపణలు వినబడుతున్నాయి.