: గొడ్డుకారం తిని పెరిగాం... దేనికైనా సమాధానం చెప్పగలం: పల్నాటి సీమలో బ్రహ్మానందం


భారతీయులు, అందునా తెలుగువాళ్లు విదేశాలకు వెళ్లినా, మనదైన భాష, సంస్కృతిని కాపాడుకునేందుకు కృషి చేయాలని ప్రముఖ సినీ హాస్యనటుడు బ్రహ్మానందం వ్యాఖ్యానించారు. ఈ మధ్యాహ్నం గుంటూరు జిల్లా పెద పలకలూరులో ఏరువ కోటిరెడ్డి స్మారక ఉపకార వేతనాలను విద్యార్థులకు బహూకరించేందుకు వచ్చిన ఆయన ప్రసంగించారు. ఇదే జిల్లా ముప్పాళ్లలో పుట్టి పెరిగిన తాను బాల్యాన్నీ, తాననుభవించిన ఆర్థిక ఇబ్బందులనూ నెమరేసుకున్నారు. "జొన్నకూడు, జొన్నంబలి, జొన్నలు తప్ప మరి సన్నన్నము సున్న సుమీ... పన్నుగ ఈ పలనాటి సీమ ప్రజలందరకున్!... గొడ్డుకారం తిని పెరిగిన శరీరాలివి. దేనినైనా ఎదుర్కోగలం, దేనికైనా సమాధానం చెప్పగలం. ఏ రకమైన ప్రయత్నాన్నైనా విరమించకుండా తుదిదాకా తీసుకుపోగల శక్తి మనకే ఉంది. అందులో ఈ పలకలూరు... ఆ రోజు స్కాలర్ షిప్ తో స్టార్ట్ అయిన నా జీవితం, అక్కడి నుంచి డీఎన్ఆర్ కాలేజీ భీమవరంలో చదువుకుంటున్నప్పుడు, మా గురువుగారు సున్నం ఆంజనేయులు గారు... ఆయన దగ్గరుండి చదివిస్తే, పైకొచ్చి, చదువుకుని, లెక్చరర్ గా చేశా. పరమేశ్వరుడి అనుగ్రహం అంటే ఏమిటో అప్పుడు తెలిసింది, దేవుడి అనుగ్రహం ఉండాలని. ప్రయత్నిస్తూ మరణిస్తే అది విజయం... ప్రయత్నం విరమిస్తే అది మరణం" అన్నారు. దేవుడి అనుగ్రహంతోనే తాను సినీ ఫీల్డుకు వచ్చానని, ఆపై తన బతుకంతా మీకు తెలిసిందేనని అన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన 1300 మంది నిరుపేద, ప్రతిభ గల విద్యార్థులకు రూ. 38 లక్షల ఉపకారవేతనాలను అందించారు.

  • Loading...

More Telugu News