: కాశ్మీర్ లో కల్లోలానికి కుట్ర పన్నిన హఫీజ్ సయీద్, సయ్యిద్ సలావుద్దీన్


జమ్మూకాశ్మీర్ లో కల్లోలానికి జమాత్ ఉద్ దవా అధినేత హఫిజ్ సయీద్, హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ కుట్ర పన్నారు. ఉగ్రవాది బుర్హాన్ వనీ హతమవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఈ రెండు తీవ్రవాద సంస్థల అధినేతలు కాశ్మీర్ ను రావణకాష్టం చేయాలని భావించారు. దీంతో వీరిద్దరూ పాక్ ఆక్రమిత జమ్ముకాశ్మీర్‌ లో కలుసుకున్నారు. పనిలోపనిగా మరింత మంది ఉగ్రవాదులను సరిహద్దులు దాటిస్తే...భద్రతా బలగాల పని వారేపడతారని వ్యూహాన్ని రచించారు. ఇప్పటికే కాశ్మీర్ లో ఉన్న తమ అనుకూలురుకి ఉద్రిక్తతలు మరింత రేగేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. వీరి ఆదేశాలతోనే మసీదుల్లో పాక్ అనుకూల నినాదాల ఆడియో టేపులు ప్లే చేస్తున్నట్టు సమాచారం. కాగా, నిన్న ఓ పోలీసు అధికారిని ఆదోళనకారులు అడ్డుకుని జీపుతో సహా నదిలో తోసేసిన సంగతి తెలిసిందే. ప్రధానంగా దక్షిణ కాశ్మీర్ లో ఆ కల్లోలానికి 89 మంది ఉగ్రవాదులు క్రియాశీలక పాత్ర పోషిస్తుండగా, వారిలో 60 మంది దక్షిణ కాశ్మీరానికి చెందినవారే కావడం విశేషం. దీంతో తాజాగా అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో భద్రతాదళాలకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. పుల్వామా, అనంత్ నాగ్, సోఫియానా, కుల్గామ్ ప్రాంతాలు తీవ్రవాదంతో అట్టుడుకుతున్నాయి. ఈ ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News