: వస్తే అరెస్ట్... ఇండియాకు రాని జకీర్ నాయక్, తప్పించుకున్నట్టేనా?
వివాదాస్పద మత గురువు, పీస్ టీవీ నిర్వాహకుడు జాకీర్ నాయక్, అనుకున్న సమయానికి ఇండియాకు రాకుండా తప్పించుకున్నాడు. ఆయన ఈ మధ్యాహ్నం ముంబైకి రావాల్సి వుండగా, తన పర్యటనను వాయిదా వేసుకున్నాడు. బంగ్లాదేశ్ లో ఉగ్రవాదులు దాడి చేసిన అనంతరం జాకీర్ పై పలు రకాల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులకు జాకీర్ ప్రసంగాలే ప్రేరణన్న కారణంతో ఇప్పటికే బంగ్లాదేశ్ లో పీస్ టీవీని నిషేధించారు కూడా. నాలుగు రోజుల నాడు కాశ్మీర్ లోయలో ఎన్ కౌంటర్ లో మరణించిన ఉగ్రవాది బుర్హాన్ సైతం తన చివరి ట్వీట్ గా, జకీర్ కు మద్దతివ్వకుంటే ఖురాన్ ను నిషేధించే రోజులు వస్తాయని చెప్పాడు. ఈ నేపథ్యంలో ఇండియాకు రాగానే ఆయన్ను ఆరెస్ట్ చేసి విచారించనున్నారని వార్తలు వినిపించాయి. అందుకే ఆయన అరెస్టును తప్పించుకునేందుకు రాలేదని తెలుస్తోంది. జకీర్ విషయంలో తొందరపాటు చర్యలు తీసుకుంటే, మత కల్లోలాలు రావచ్చన్న ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో పోలీసులు ఆచితూచి అడుగులు వేస్తుండగా, జకీర్ తన రాకను వాయిదా వేసుకోవడం గమనార్హం. తదుపరి ఆయన ప్రసంగం నేటి సాయంత్రం టీవీ చానల్ లో రానుంది. ఎందుకు ఇండియాకు రాలేదన్న విషయాన్ని ఆయన ప్రస్తావించవచ్చని సమాచారం.