: పైకి యుద్ధనౌకగా కనిపించే 'యూఎస్ఎస్ ఐసెన్ హోవర్' కింద ఏ టూ జడ్ సౌకర్యాలు!


యూఎస్ఎస్ ఐసెన్ హోవర్... ఇరాక్, సిరియాలకు సమీపంలో నిలిపి ఉంచిన అమెరికా యుద్ధ నౌక. పగలు, రాత్రి తేడా లేకుండా ఇక్కడి నుంచి ఫైటర్ విమానాలు టేకాఫ్ తీసుకుంటుంటాయి. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులపై బాంబుల వర్షం కురిపించి తిరిగి దీనిపైకి చేరుకుంటాయి. ఇదంతా పై డెక్ మీద నిత్యమూ కనిపించేదే. ఒక్క రెండు అడుగులు కిందకు దిగితే, అక్కడ కనిపించే ప్రపంచమే వేరు. ఈ షిప్ లో మొత్తం 5 వేల మంది ఉంటారు. అందులో 1000 మంది మహిళలు. నిత్యమూ యుద్ధ విమానాల్లో వెళ్లి వస్తుండే సైనికులకు కావాల్సిన అన్ని రకాల సేవలనూ అందించడమే వీరి కర్తవ్యం. రోజూ దాదాపు 200 మంది పైలట్లు తమకు అప్పగించిన మిషన్లను పూర్తి చేసి తిరిగి 'యూఎస్ఎస్ ఐసెన్ హోవర్' పైకి వస్తుంటారు. షిప్ లోని వారిలో అత్యధికులు విమానాల నిర్వహణ, ఆయుధాలను ఫైటర్ జట్స్ లోకి చేర్చడం వంటి పనుల్లో ఉంటే, మరికొందరు షిప్ నిర్వహణలో భాగంగా పనిచేస్తుంటారు. వందల సంఖ్యలో వంటవారుంటారు. వైద్యులూ ఉన్నారు. ఇక విధి నిర్వహణలో భాగంగా, అలసి సొలసే వీరికి సేద తీర్చేందుకు గాను, డెంటిస్ట్ క్లినిక్ ల నుంచి, సెలూన్లు, స్టార్ బక్స్, పబ్స్, మూవీ థియేటర్స్ వంటి ఏర్పాట్లన్నీ యుద్ధ నౌక కింద డెక్ లో ఉన్నాయి. ఒకసారి షిప్ ఎక్కి సముద్రంలో ప్రయాణించడం మొదలు పెడితే, దాదాపు ఏడు నెలల పాటు తిరిగి భూమిని చూసే అవకాశం ఎవరికీ ఉండదు. ఈ 5 వేల మందిలో అత్యధికులకు పై డెక్ పైకి వచ్చేందుకు అనుమతి కూడా ఉండదు. తన షిప్ లోని వారందరినీ సంతోషంగా ఉంచడం తన బాధ్యతని, వారికి సకల సౌకర్యాలు సమకూర్చడంలో తనకు ఎంతో ఆనందం కలుగుతుందని షిప్ కెప్టెన్ పౌల్ స్పెడిరో వెల్లడించారు. ఈ షిప్ లో ఆయన గొంతు నిత్యమూ వినిపిస్తూనే ఉంటుంది. ఆ రోజు జరిపిన దాడుల గురించి చెబుతూ, 'సెయిలర్ ఆఫ్ ది డే'ను ప్రకటించి అందరినీ ఉత్సాహపరుస్తుంటారు. అప్పుడప్పుడూ ఆయన నోటి నుంచి వచ్చే "సహాయక షిప్ వస్తోంది. సలాడ్లు, తాజా పండ్లు కొన్ని రోజుల్లో మీ మెనూలోకి వచ్చి చేరతాయి" అనే మాటల కోసం ఎదురు చూస్తుంటామని చెబుతుంటారు ఇక్కడ పనిచేసేవారు.

  • Loading...

More Telugu News