: ఏపీ రెండేళ్ల శిశువు.. మా అభివృద్ధికి తోడ్పడండి: రష్యాలో చంద్రబాబు
రష్యా-భారత్ మధ్య సంబంధాలు దృఢంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రష్యా పర్యటనలో ఉన్న ఆయన ఈరోజు ఇన్నోప్రోమ్-2016 సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘భారత్ ప్రాధాన్యాన్ని చాటుతూ మా ప్రధాని ప్రపంచమంతా చుట్టివస్తున్నారు’ అని ఆయన వ్యాఖ్యానించారు. రష్యా, ఆంధ్రప్రదేశ్‌కి మధ్య ఉన్న సత్సంబంధాలు ఈ నాటివి కాదని ఆయన పేర్కొన్నారు. ‘ఏపీ రెండేళ్ల శిశువు, మా ఎదుగుదలకు తోడ్పడండి’ అని చంద్రబాబు కోరారు. తీరప్రాంత అభివృద్ధికి రష్యాతో కలిసి పనిచేయాలని అనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ‘ఆంధ్రప్రదేశ్ నవ్యరాజధాని అమరావతి నిర్మాణంలో మీరు మాకు భాగస్వాములు కావాలి’ అని ఆయన అన్నారు. భారత్ ఎంతో వేగంగా అభివృద్ధి సాధిస్తోందని ఆయన అన్నారు. రెండంకెల వృద్ధిరేటును సాధించే దిశగా భారత్ ఉందని ఆయన పేర్కొన్నారు.