: మొక్కలు నాటితేనే ఇల్లు కట్టుకోవడానికి అనుమతి!: కేటీఆర్
వర్షాకాలంలో అన్ని జిల్లాల్లో చెరువులు నిండుతున్నా.. మెదక్‌లో సరైన వర్షాలు లేవని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని బీహెచ్ఈఎల్‌లో గవర్నర్ నరసింహన్, మంత్రి హరీశ్‌రావు, పలువురు టీఆర్ఎస్ నేతలతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం మాట్లాడారు. మెదక్ జిల్లాలో అటవీ విస్తీర్ణం చాలా తక్కువగా ఉందని, అందుకే వర్షాలు లేవని ఆయన పేర్కొన్నారు. తాము మెదక్ జిల్లాలోనే మూడు లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. ఉద్యమ స్ఫూర్తిని చాటి హరితహారంలో పాల్గొందామని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్‌కి మానసపుత్రికగా ఆయన అభివర్ణించారు. చైనా, ఆఫ్రికా తర్వాత తెలంగాణలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 24 శాతం మాత్రమే అటవీ విస్తీర్ణం ఉందని, దాన్ని 33 శాతంకు పెంచాలని ఆయన పేర్కొన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని పరిరక్షించాలని కూడా ఆయన సూచించారు. మొక్కలు నాటితేనే కొత్త ఇల్లు కట్టుకోవడానికి, పరిశ్రమల స్థాపనకు అనుమతి మంజూరు చేసే దిశగా తెలంగాణ సర్కార్ యోచిస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు. పర్యావరణ సమతుల్యతను రక్షించుకోవాలంటే చెట్లు నాటాలని ఆయన అన్నారు. హరితహారం ప్రభుత్వ కార్యక్రమంగా చూడకుండా ప్రజలందరూ దీనిలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. మొక్కలు పెంచి ముందు తరాలకు ఆకుపచ్చని తెలంగాణను అందించాలని ఆయన అన్నారు.