: డాక్టర్లను అసాధారణమైన కోరిక కోరిన వితంతు మహిళ... ఇండియాలో కుదరదని సమాధానం!
న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి వైద్యుల ముందుకు గతంలో ఎవరూ కోరనటువంటి అసాధారణ కోరికను ఉంచింది ఓ వితంతు మహిళ. మరణించిన తన భర్త వీర్యాన్ని వెలికితీసి తనకివ్వాలని ఆమె కోరింది. దీనికి వైద్యులు కుదరదని సమాధానం చెప్పారు. ఇండియాలో పోస్ట్ మార్టం చేసి వీర్యాన్ని బయటకు తీసేందుకు విధివిధానాలేవీ లేవని తెలిపారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, కొన్నేళ్ల క్రితం వివాహమై, పిల్లలు లేని ఓ జంటలో భర్తకు యాక్సిడెంట్ అయింది. అతన్ని ఆసుపత్రికి తీసుకువచ్చేలోపే చనిపోయాడు. అతని జ్ఞాపకాలను బతికించుకోవాలని ఆశపడ్డ ఆ మహిళ, వీర్యాన్ని తీసి ఇవ్వాలని కోరింది. ఆమె కోరికకు అత్తామామలు సైతం మద్దతిచ్చారు. అయితే, ఆమె కోరికను తీర్చలేమని వైద్యులు స్పష్టం చేశారు. ఈ మొత్తం ఉదంతం 'జర్నల్ ఆఫ్ హ్యూమన్ రీప్రొడక్టివ్ సైన్సెస్'లో ఆర్టికల్ గా ప్రచురితమైంది. పీఎంఎస్ఆర్ (పోస్ట్ మార్టమ్ స్పెర్మ్ రీట్రైవల్)పై ఇండియాలో విధివిధానాన్ని రూపొందించాల్సిన సమయం ఆసన్నమైందని పలువురు డాక్టర్లు అభిప్రాయపడ్డారు. వ్యక్తి మరణించిన తరువాత 24 గంటల వరకూ వీర్య కణాలు జీవించే ఉంటాయని వివరించిన ఎయిమ్స్ ఫోరెన్సిక్ సైన్స్ విభాగం హెడ్ సుధీర్ గుప్తా, కేవలం ఐదు నిమిషాల వ్యవధిలో వీర్యాన్ని సేకరించి దాచవచ్చని, దాని ద్వారా మరణించి వ్యక్తి వారసుడిని అందించవచ్చని తెలిపారు. అయితే, దీనికి చట్టపరమైన అనుమతులు మాత్రం లేవని అన్నారు. ఇండియాలో పీఆర్ఎస్ఎం కోసం నెమ్మదిగా డిమాండ్ పెరుగుతోందని, ఎన్నో దేశాల్లో ఈ విధానం అమల్లో ఉందని డాక్టర్లు తెలిపారు.