: ఒక్కటైన ఇండియా అత్త.. రష్యా కోడలు: సుష్మా చొరవతో సమస్య పరిష్కారం


ఆస్తి విషయంలో పొడసూపిన విభేదాలతో రోడ్డుకెక్కిన రష్యా కోడలు, ఇండియా అత్త వివాదం సద్దుమణిగింది. కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ చొరవతో సమస్య పరిష్కారమైంది. దీంతో తిరిగి అత్తాకోడళ్లు ఇద్దరూ ఒక్కటయ్యారు. రష్యాకు చెందిన ఓల్గా ఆగ్రాకు చెందిన విక్రాంత్ సింగ్‌ను 2011లో వివాహం చేసుకుంది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. వ్యాపారంలో భాగంగా వీరు గోవాలో ఉంటున్నారు. బిజినెస్‌లో నష్టాలు రావడంతో ఇటీవల వీరు తిరిగి ఆగ్రా చేరుకున్నారు. అయితే కొడుకు, కోడలును ఇంట్లోకి రానిచ్చేందుకు ఓల్గా అత్త నిర్మలా చందేల్ నిరాకరించింది. అంతేకాక ఆస్తిని స్కూలు నడుపుతున్న తన కుమార్తెకు రాసిచ్చేసింది. ఇది కాస్తా వివాదంగా మారడంతో ఓల్లా అత్త ఇంటి బయట నిరసనకు దిగింది. న్యాయంగా తన కుటుంబానికి రావాల్సిన ఆస్తిని ఇవ్వాలని డిమాండ్ చేసింది. జాతీయ స్థాయిలో ఈ వార్త సంచలనం రేపడంతో విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి సుష్మాస్వరాజ్ స్పందించారు. ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కోరుతూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు ట్వీట్ చేశారు. ఆ తర్వాత కాసేపటికే రంగంలోకి దిగిన ఆగ్రా పోలీసులు సమస్య పరిష్కారానికి ప్రయత్నించి సఫలమయ్యారు. ఈ విషయాన్ని తిరిగి యూపీ సీఎం కార్యాలయం సుష్మకు ట్వీట్ చేసింది. అత్తమామలకు కౌన్సెలింగ్ అనంతరం అంతా కలిసిపోయినట్టు పేర్కొంది.

  • Loading...

More Telugu News