: తమిళనాడులో దానంతట అదే కదిలిన రైలు... ఎక్కడికక్కడ ఆగిన ఎక్స్ ప్రెస్ రైళ్లు
తమిళనాడులోని అరక్కోణం రైల్వే జంక్షన్ లో పార్క్ చేసిన రైలు దానంతట అదే కదిలిపోవడంతో ఆ మార్గంలో ప్రయాణించే రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నేటి ఉదయం అరక్కోణం నుంచి చెన్నై మధ్య తిరిగే సబర్బన్ రైలు పార్కింగ్ ట్రాక్ నుంచి కదిలింది. దాదాపు అర కిలోమీటరు దూరం ప్రయాణించి కలకలం రేపింది. విషయం తెలుసుకున్న అధికారులు సిగ్నల్ వ్యవస్థను ఆపేశారు. దీంతో మంగళూరు చెన్నై మెయిల్, సత్యసాయి ప్రశాంతి నిలయం - చెన్నై సెంట్రల్ ఎక్స్ ప్రెస్ సహా ఆ మార్గంలో తిరిగే సబర్బన్ రైళ్లను ఎక్కడివక్కడ ఆపేశారు. రైలు ఆగేంత వరకూ దాని మార్గంలో మరో రైలు ప్రయాణించకుండా జాగ్రత్త పడ్డారు. తెల్లవారుఝామున 4 గంటల సమయంలో ఈ ఘటన జరుగగా, 5:15 తరువాతనే రైళ్లు కదిలేందుకు అనుమతి ఇచ్చినట్టు తెలిసింది. రైలు ఎందుకు కదిలిందన్న విషయం తెలియడం లేదని, ఈ తరహా ఘటనను ఇంతకు ముందెన్నడూ చూడలేదని, విచారణకు ఆదేశించామని అధికారులు తెలిపారు.