: 75 ఏళ్ల వయసులో ముచ్చటగా మూడో పెళ్లికి సిద్ధమైన ఫుట్ బాల్ దిగ్గజం పీలే
బ్రెజిల్ ఫుట్ బాల్ జట్టు మాజీ ఆడగాడు పీలే, ఏడు పదుల వయసులో ముచ్చటగా మూడో పెళ్లికి రెడీ అయిపోయాడు. 42 ఏళ్ల మార్సియా సిబెలేతో గత ఆరేళ్లుగా డేటింగ్ చేస్తున్న పీలే, మంగళవారం నాడు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని పీలే స్వయంగా ఓ దినపత్రికకు వెల్లడించాడు. ఎన్నో ఏళ్ల క్రితమే సిబెలేతో పీలేకు పరిచయం ఉందని తెలుస్తోంది. కాగా, పీలే తొలుత రోజ్ మేరీ చోల్బీని వివాహం చేసుకుని ఎదిన్హో, జెన్నీఫర్, కెల్లీలకు జన్మనిచ్చాడు. ఆపై రోజ్ మేరీని వదిలేసి అస్సిరియా నాసిమెంటోను పెళ్లి చేసుకుని కవలు జోషువా, సెలెస్టేలను కన్నాడు. సాంటోస్, న్యూయార్క్ కాస్మోస్, బ్రెజిల్ జట్ల తరఫున 1,363 మ్యాచ్ లు ఆడిన పీలే 1,281 గోల్స్ చేసి ప్రపంచంలోనే అత్యుత్తమ ఫుట్ బాల్ ఆటగాడిగా పేరు సంపాదించుకున్నాడు.