: ఆదిలాబాద్ లో కుండపోత... ప్రజలకు తీవ్ర ఇబ్బందులు
గత రాత్రి నుంచి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షానికి పలు వాగులు, వంకలు పొంగి పొర్లుతుండగా, సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. పలు చోట్ల రహదారులపై నీరు ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలకు సైతం ఆటంకాలు ఏర్పడ్డాయి. ముందు జాగ్రత్తగా పలు పట్టణాలు, గ్రామాల్లో కరెంటును తీసివేసినట్టు తెలుస్తోంది. మందమర్రి, మంచిర్యాల ప్రాంతాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. వరదనీరు గోదావరి నదిలోకి చేరుతోంది. పెన్ గంగా, ప్రాణహిత నదులు పొంగి పొరలుతున్నాయి. చెరువులన్నీ జలకళతో నిండుకుండల్లా మారాయి. సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో భారీగా వరద నీరు చేరడంతో, బొగ్గు తవ్వకం ఆపేశారు. కొమరం భీమ్ ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో మూడు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులోకి 25 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా, 15 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గుండి వాగు ఉప్పొంగుతోంది. జిల్లాలో సరాసరిన 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని, ఈ సీజనులో ఇదే అత్యధికమని అధికారులు తెలిపారు. ఇక కరీంనగర్ జిల్లా మహదేవ్ పూర్ మండలంలో కుంభవృష్టి కురవగా, పెద్దంపేట, సర్వాయి పేట, పంకెన వాగుల్లోకి పెద్దఎత్తున వరద నీరు చేరింది. దీంతో 17 లోతట్టు ప్రాంతాల గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.