: పెళ్లి కొడుక్కి కట్నంగా వేప మొక్క.. టాక్ ఆఫ్ ద టౌన్‌గా వివాహం!


ఒకప్పుడు సమాజాన్ని విపరీతంగా పట్టి పీడించిన వరకట్న సమస్య ఇప్పుడు కాస్త తగ్గినప్పటికీ, ఉత్తర భారతంలో మాత్రం కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ అధికంగానే కనిపిస్తుంది. ఆ ప్రాంతాలలో పెళ్లి నిశ్చయమైందని చెప్పగానే చాలామంది మొదట అడిగే ప్రశ్న కట్నమెంత అని. రాజస్థాన్‌లోని కోటాలో ఓ ఆడపిల్ల తండ్రి మాత్రం వరుడికి కట్నంగా వేప మొక్క ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ వివాహం గురించే చర్చ. కోటాలోని ధాకర్‌ఖెరీలో జరిగిందీ ఆదర్శ వివాహం. ఈ పెళ్లిని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు. తన వద్ద కుమార్తె, వేప మొక్క తప్ప మరేమీ ఆస్తులు లేవని, కట్నంగా వేప మొక్కను మాత్రమే ఇవ్వగలనని వధువు తండ్రి చెప్పాడు. దీనికి సరేనన్న వరుడి తరపు బంధువులు పెళ్లికి అంగీకరించారు. అయితే వరుడి చేతిలో పెట్టిన తన కుమార్తెతోపాటు మొక్కను కూడా జాగ్రత్తగా చూసుకోవాలని కండిషన్ పెట్టాడు. వరుడి కుటుంబ సభ్యులు ఇందుకు సంతోషంగా అంగీకరించడంతో వధువు శకుంతలతో వరుడు లక్ష్మణ్ వివాహం ఘనంగా జరిగింది. 9వ తరగతి వరకు చదువుకున్న శకుంతల వివిధ ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తులు నింపేందుకు గ్రామస్తులకు సాయపడుతోంది. వరకట్న ఆచారాన్ని దురాచారంగా భావించే శకుంతల తన తండ్రి చేసిన పనికి ఎంతో గర్వపడుతోంది.

  • Loading...

More Telugu News