: జైన సన్యాసి అంత్యక్రియలు జరిపించేందుకు వేలం... రూ. 7 కోట్లకు పాడుకున్న దేశ విదేశీ ప్రముఖులు
ఇటీవల మరణించిన జైన సన్యాసి మద్విజయ్ రవీంద్రసూరి మహరాజ్ సాహెబ్ (62) అంత్యక్రియలు నిర్వహించే సందర్భంగా జరిపించే క్రతువులను స్వయంగా చేసేందుకు వేలం నిర్వహించగా, దేశ విదేశీ ప్రముఖులు రూ. 7 కోట్లకు పాడుకున్నారు. మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలోని రాజ్ గఢ్ లో ఈ ఘటన జరిగింది. మొత్తం 25 క్రతువులకు వేలం నిర్వహించారు. మృతదేహం పాదాలు కడగడం, వస్త్రాన్ని కప్పడం, తుది హారతి ఇవ్వడం, కుంకుమ, చందనం సమర్పించడం వంటి క్రతువులకు వేలం జరిగింది. పలువురు బంగారం వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు వేలంలో పాల్గొన్నారు. దుబాయ్ నుంచి వచ్చిన జయేష్ భాయ్ రూ. 68 లక్షలకు తొలి పూజల అవకాశాన్ని పాడుకోగా, రెండు, మూడు, నాలుగో పూజలకు వరుసగా రూ. 42 లక్షలు, రూ. 27 లక్షలు, రూ. 20 లక్షలు లభించాయి. వస్త్ర సమర్పణ అవకాశం తనకివ్వాలని రూ. 52.52 లక్షలకు మరో వ్యాపారి పాడుకున్నారు. జైనుల్లో మహారాజ్ సాహెబ్ హోదా అత్యంత సీనియర్ సన్యాసికి మాత్రమే లభిస్తుంది. రవీంద్ర సూరి మహారాజ్ సాహెబ్ ఆధ్వర్యంలో 10 మంది పురుషులు, 75 మంది మహిళలు సన్యాసి హోదా తీసుకున్నారు. వేలం ద్వారా వచ్చిన డబ్బును జైనుల సంక్షేమానికి వాడతామని ఆలయ ట్రస్ట్ ప్రకటించింది.