: జీఎస్టీ బిల్లులో కీలక డిమాండుపై వెనక్కి తగ్గిన కాంగ్రెస్!
ఆర్థిక సంస్కరణల్లో భాగంగా తీసుకురావాలని భావిస్తున్న అత్యంత కీలకమైన జీఎస్టీ బిల్లుకు మరో ప్రధాన అడ్డంకి తొలగింది. ఈ బిల్లుకు మోకాలొడ్డుతున్న కాంగ్రెస్, కీలక డిమాండుపై వెనక్కు తగ్గింది. వస్తు సేవల రంగంలో పన్ను వసూలును గరిష్ఠంగా 18 శాతంగా బిల్లులో పేర్కొనాలని డిమాండ్ చేస్తూ వస్తున్న కాంగ్రెస్ దాన్ని విరమించుకుంది. ఈ డిమాండ్ పై ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయబోమని రాజ్యసభలో విపక్ష ఉపనేత ఆనంద్ శర్మ వెల్లడించారు. అయితే, భవిష్యత్తులో పన్ను భారాన్ని పెంచకుండా ప్రభుత్వం నుంచి హామీ కావాలని ఆయన అన్నారు. ఈ బిల్లును 18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందాలని ఎన్డీయే ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. రాజ్యసభలో ఎన్డీయేకు బిల్లులను పాస్ చేయించుకునేందుకు అవసరమైన మెజారిటీ లేకపోగా, కాంగ్రెస్ తదితర మిత్రపక్షాల సహకారం తప్పనిసరి. ఇక జీఎస్టీ బిల్లును తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీనివల్ల రాష్ట్రాల ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటాయని అటు జయలలిత, ఇటు మమతా బెనర్జీలు ఆరోపిస్తూనే ఉన్నారు. అయితే, వీరి వాదనలను మోదీ సర్కారు కొట్టి పారేసింది. బిల్లుతో ఏకరూప పన్ను విధానం అమలవుతుందే తప్ప, ఎలాంటి ఇబ్బందులు రావని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు.