: ఈ బిల్లు వస్తే, అమెరికాకు వెళ్లాలన్న ఐటీ ఉద్యోగుల ఆశలకు బ్రేక్!


తక్కువ వేతనానికి విదేశాల నుంచి ఉద్యోగులను అమెరికాకు తీసుకొస్తూ, నిరుద్యోగుల సంఖ్య పెరగడానికి కారణమవుతున్న హెచ్-1బీ, ఎల్ 1 వర్క్ పర్మిట్ వీసాల విధానాన్ని మరింత కఠినం చేసేలా యూఎస్ సెనెట్ లోకి మరో బిల్లు వచ్చింది. డెమోక్రటిక్ సభ్యుడు బిల్ పాస్క్రెల్, రిపబ్లికన్ సభ్యుడు డోనా రోహర్ బాచర్ లు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. విదేశీ ఐటీ సంస్థలు మొత్తం ఉద్యోగుల్లో 50 శాతానికి మించకుండా మాత్రమే హెచ్-1బీ, ఎల్ 1 వీసాల ద్వారా ఉద్యోగులను నియమించుకునేలా చట్ట సవరణ చేయాలన్నది బిల్లులోని ప్రధానాంశం. ఇక ఈ బిల్లుపై అధ్యక్షుడు బరాక్ ఒబామా సంతకం చేయాలంటే, అంతకన్నా ముందు సెనెట్ ఆమోదం పొందాల్సి వుంటుంది. అమెరికాలో భారతీయులు అధికంగా కనిపించే న్యూజర్సీ, కాలిఫోర్నియాల ప్రతినిధులు పాస్క్రెల్, డోనాలు ఈ బిల్లును ప్రవేశపెట్టడం గమనార్హం. దీనికి సెనెట్ ఆమోదం పలికితే, ఇండియా నుంచి వర్క్ పర్మిట్, హెచ్-1బీ వీసాలపై వెళ్లాలని భావించే ఐటీ ఉద్యోగులపైనే ప్రధానంగా ప్రభావం పడుతుందని అంచనా. "ఇక్కడి యూనివర్శిటీలలో ఎంతో మంది నాణ్యతతో కూడిన విద్యను అభ్యసిస్తున్నారు. వారి డిగ్రీలు వారికి ఉపాధిని దగ్గర చేయడం లేదు. విదేశాల నుంచి వస్తున్న ఉద్యోగులే ఇందుకు కారణం. అమెరికా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెంచాలన్నదే మా అభిమతం" అని బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా పాస్క్రెల్ వ్యాఖ్యానించారు. కాగా, అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న వివిధ ఐటీ కంపెనీలు ఇండియా నుంచి వీసాలపై ఉద్యోగులను తీసుకువెళ్లి తక్కువ వేతనాలకు పనిచేయించుకుంటూ, ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్న సంగతి తెలిసిందే. తాజా బిల్లుకు ఆమోదం లభించిన పక్షంలో ఐటీ కంపెనీల ఆదాయం గణనీయంగా తగ్గుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News