: స్టెఫీగ్రాఫ్ సరసన సెరీనా విలియమ్స్


ప్రపంచ టెన్నిస్ రంగంలో తిరుగులేని రారాణిగా తన పయనాన్ని కొనసాగిస్తున్న సెరీనా విలియమ్స్ మరో రికార్డును నమోదు చేసింది. టెన్నిస్ చరిత్రలో 22 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను సొంతం చేసుకున్న స్టెఫీగ్రాఫ్ రికార్డును సమం చేసింది. వింబుల్డన్ ఫైనల్స్ లో భాగంగా ఏంజలిక్ కెర్బర్ తో తలపడిన సెరీనా 7-5, 6-3 తేడాతో సునాయాసంగా విజయం సాధించి తన 22వ గ్రాండ్ స్లామ్ ను సొంతం చేసుకుంది. 81 నిమిషాల పాటు సాగిన మ్యాచ్ లో 13 ఏస్ లను సంధించిన సెరీనా, 39 విన్నర్స్ తో ఆద్యంతం ప్రత్యర్థిపై ఆధిపత్యం చూపింది. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ, "వింబుల్డన్ లో ఆడటాన్ని ఎప్పుడూ గొప్పగానే భావిస్తుంటాను. కెర్బర్ బాగా ఆడింది. ఈ సెంటర్ కోర్టును నేను సొంత ఇల్లుగానే భావిస్తుంటాను" అని వెల్లడించింది. మహిళా టెన్నిస్ చరిత్రలో 24 టైటిళ్లు సాధించిన మార్గరెట్ రికార్డును, ఆపై 9 వింబుల్డన్ టైటిళ్లు సాధించిన మార్టీనా నవ్రతిలోవా రికార్డును సమం చేయాలన్నది తన తదుపరి లక్ష్యాలని వెల్లడించింది. కాగా, ఈ విజయంతో ఆమెకు 2.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 16.5 కోట్లు) ప్రైజ్ మనీ లభించింది.

  • Loading...

More Telugu News