: కాకినాడలో 'నేచురల్స్' బ్యూటీ పార్లర్ నిర్వాకం... నిశ్చితార్థం ఆగిపోయేలా ఉందంటున్న బాధితురాలు!
నిశ్చితార్థానికి అందంగా తయారవ్వాలన్న ఆమె ఆశ అడియాశ కాగా, నిశ్చితార్థమే ఆగిపోయే పరిస్థితి ఏర్పడిందని వాపోతోంది ఓ యువతి. మరిన్ని వివరాల్లోకి వెళితే, కాకినాడలో ఓ యువతి, మరింత అందం కోసం నేచురల్స్ బ్యూటీ పార్లర్ కు వెళితే, తన కురులను సగానికి కత్తిరించి అంద విహీనంగా మార్చారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మూడు అడుగుల పొడవైన తన కురులను, తనకు చెప్పకుండా కత్తిరించారని ఆమె తెలిపింది. చిన్నప్పటి నుంచీ ఇష్టంగా పెంచుకున్న పొడవాటి జుట్టును క్షణాల్లో తీసేశారని వాపోయింది. సగం జుట్టుతో తన నిశ్చితార్థం చెడిపోయేలా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై నేచురల్స్ ప్రతినిధులను పోలీసులు విచారించగా, ఘటనలో తమ తప్పు లేదని, ఆమె కోరినట్టుగానే చేశామని బ్యూటీ పార్లర్ సిబ్బంది వెల్లడించారు. కేసును దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.