: దివ్యాంగురాలి దీనగాధ... సోదరి శవంతోనే ఐదురోజులు గడిపిన వైనం!
దివ్యాంగురాలి దీన గాధ ఇది. తన కళ్లముందే సోదరి కుప్పకూలి మరణించినా ఆ విషయం ఎవరికీ తెలియజేయలేక ఐదు రోజుల పాటు మృతదేహంతోనే గడిపిన హృదయ విదారక సంఘటన ఇది. చెన్నైకి చెందిన ఎం.గోవిందమ్మాళ్ (55)కు వివాహం కాలేదు. దివ్యాంగురాలైన తన సోదరి ఉమ(60) బాగోగులు చూసుకుంటూ ఇద్దరూ ఓ ఇంట్లో నివసిస్తున్నారు. సోమవారం రాత్రి భోజనం చేస్తున్న సమయంలో గోవిందమ్మాళ్ తనకు తలనొప్పిగా ఉందని, ఏదో చెప్పలేని బాధగా ఉందని సోదరితో చెప్పి మాత్ర వేసుకుంది. ఆ తర్వాత కొంతసేపటికే మంచంపై కుప్పకూలిపోయింది. ఆమెను పిలిచినా పలకకపోవడంతో నిద్రపోతోందని ఉమ భావించింది. మర్నాడు కూడా ఆమె లేవకపోవడంతో అనుమానం వచ్చింది. తానున్న స్థలం నుంచి కదలలేని ఉమ సోదరి మంచం వద్దకు వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మంచంపై ఉన్న సెల్‌ఫోన్‌ను తీసుకుని తన మరో సోదరికి ఫోన్ చేద్దామన్నా ఆమె శరీరం సహకరించలేదు. దీంతో తనలో తనే కుమిలిపోయింది. మృతదేహం నుంచి వస్తున్న దుర్గంధం మధ్య ఐదు రోజులుగా ఆహారం నీళ్లు లేకుండా గడిపింది. చివరికి వారింట్లో నుంచి దుర్గంధం వస్తుండడంతో ఇరుగు పొరుగువారు పోలీసులకు ఫోన్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, శుష్కించి పడి ఉన్న ఉమను ఆస్పత్రికి తరలించారు.