: పొలంలో వెలుగుచూసిన బంగారం...ఆరా తీసేందుకు పోలీసుల పరుగు!


పొలంలో బంగారం దొరకడం విజయనగరం జిల్లా సాలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో కలకలం రేపింది. సాలూరు డివిజన్ పరిధిలోని పాచిపెంట మండలం శ్యామలగౌరీపురంలో శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన సమీర్‌ కు కొంత భూమి ఉంది. దీనిని సాలూరు పట్టణానికి చెందిన శ్రీనివాసరెడ్డి లీజుకు తీసుకుని పంటపండిస్తున్నారు. ఖరీఫ్ సీజన్ కావడంతో వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో నాట్లు వేసేందుకు భూమిని చదును చేశారు. అనంతరం కురిసిన వర్షాలకు ఓ యువతికి ఈ పొలంలో ఓ పెట్టె లభ్యమైంది. ఈ పెట్టెలో బంగారు పూసలు, చైన్లు, ఆభరణాలు, నాణేలు వెలుగు చూశాయి. వాటిని తీసుకున్న ఆ యువతి గ్రామంలోని అష్టలక్ష్మీదేవి ఆలయం వద్దనున్న చేతి బోరు వద్ద వాటిని శుభ్రం చేసి ఇంటికి తీసుకువెళ్లింది. దీంతో ఈ విషయం ఆనోటా ఆనోటా చేరి గ్రామమంతా పాకింది. దీంతో గ్రామంలోని మరికొందరు ఆ పొలంలోనికి వెళ్లి వెతకగా బంగారు పూసలు, ముక్కుపుడకలు, చైన్లు, మరికొన్ని వెండి ఆభరణాలు దొరికాయి. ఈ విషయం క్షణాల్లో మండలం మొత్తం పాకింది. దీంతో వీటిని స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ఆ గ్రామానికి వెళ్లి బంగారు నగలు దొరికాయన్న పేర్లున్న ప్రతి ఒక్కరినీ విచారిస్తున్నారు. కాగా, ఇప్పటికే ఒకరు ఓ చైన్ ను అమ్మినట్టు తెలియడంతో దానిని కొనుగోలు చేసిన బంగారం షాపు వ్యక్తిని కూడా విచారిస్తున్నారు. మొత్తం ఎంత బంగారం దొరికింది అన్న విషయాలు ఆరాతీస్తున్నారు.

  • Loading...

More Telugu News