: కుమారుడ్ని రక్షించుకునేందుకు రాజస్థాన్ ఎమ్మెల్యే చెప్పినవన్నీ అబద్ధాలని రుజువయ్యాయి!
తాగిన మైకంలో ముగ్గురిని బలిగొన్న కుమారుడ్ని రక్షించుకునేందుకు రాజస్థాన్ ఎమ్మెల్యే నందకిషోర్ మహారియా చెప్పినవన్నీ అబద్ధాలని తేలిపోయింది. జైపూర్ లో ఇటీవల తాగిన మైకంలో బీఎండబ్లూ కారు నడిపి ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అమాయకుల ప్రాణాలను నందకిషోర్ మహారియా కుమారుడు సిద్ధార్థ్ మహారియా బలిగొన్నాడు. ఆ ఆటోను ఢీ కొన్నప్పుడు బీఎండబ్యూ కారును తన కుమారుడు నడపడం లేదని, డ్రైవర్ నడిపాడని, తన కుమారుడికి మద్యం తాగే అలవాటే లేదని, పాలు తప్ప, మరొకటి తాగడని ఆయన తెలిపారు. యాక్సిడెంట్ జరిగిన సమయంలో తన కుమారుడి కారుకి ఎదురుగా వచ్చిన ఆటోకు లైట్లు లేవని వాదించారు. ఆయన చేసిన ప్రతి వాదనపైన దృష్టిసారించిన పోలీసులు, యాక్సిడెంట్ కు ముందు సిద్ధార్థ్ మహారియా సంచరించిన ప్రదేశాలకు సంబంధించిన సీసీ పుటేజ్ లను పరిశీలించి సేకరించారు. ఇందులో ఓ బార్ లో స్పానిష్ వైన్, కొసేకా బ్రాండ్ కు చెందిన వైన్ తీసుకున్నాడని తేలింది. దీంతో మద్యం తాగడని, పాలు మాత్రమే తాగుతాడన్న ఎమ్మెల్యే వాదన వీగిపోయింది. తాను వైన్ తీసుకున్న తరువాత డ్రైవింగ్ సీట్లో ఉన్న డ్రైవర్ తప్పించి, తాను డ్రైవర్ సీటులో కూర్చోవడం వీధిలోని సీసీ టీవీ పుటేజ్ లో రికార్డయింది. దీనితో పాటు, కారుకు ఎదురొచ్చిన ఆటో లైట్లు పనిచేస్తున్నాయని దర్యాప్తులో తేలింది. దీంతో ఎమ్మెల్యే చేసిన వాదన వీగిపోగా, మద్యం బిల్లులతో పాటు, సీసీ టీవీ సాక్షాలను కూడా పోలీసులు సిధ్ధం చేశారు.