: ఎన్నికల హామీల అమలుపై బహిరంగ చర్చకు చంద్రబాబు సిద్ధమా?: భూమన సవాల్


ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుపై బహిరంగ చర్చకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సిధ్ధమా? అని వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సవాలు విసిరారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ, ఈ చర్చను టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించినా తమకు అభ్యంతరం లేదని అన్నారు. ఈ చర్చకు తమ పార్టీ అధినేత జగన్ హాజరవుతారని, టీడీపీ అధినేత చంద్రబాబు హాజరుకాగలరా? అని ఆయన నిలదీశారు. పోనీ, ఎన్నికల హామీల అమలుపై బహిరంగ బ్యాలెట్ కు అయినా ఆయన సిద్ధమా? అని భూమన అడిగారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను పదవుల నుంచి రాజీనామా చేయించే దమ్ము చంద్రబాబుకు ఉందా? అని ఆయన సవాలు విసిరారు. ఇబ్రహీంపట్నం థర్మల్ పవర్ ప్లాంట్ టెండర్లలో 2,500 కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయని ఆయన తెలిపారు. సోనియా గాంధీ, చంద్రబాబు కక్షసాధింపు చర్యల వల్లే జగన్ జైలుకు వెళ్లాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News