: మూడు రోజుల్లో 105 కోట్లు కొల్లగొట్టిన 'సుల్తాన్'!
ఈద్ బరిలో తనను మంచిన మొనగాడు లేడని సల్మాన్ ఖాన్ మరోసారి నిరూపించాడు. 'వాంటెడ్' (పోకిరి), 'దబాంగ్', 'ఏక్ థా టైగర్', 'బాడీ గార్డ్', 'కిక్', 'ప్రేమ్ రతన్ ధన్ పాయో', 'భజరంగీ భాయ్ జాన్', 'సుల్తాన్'... ఇవన్నీ 'ఈద్' పండుగ నాడే విడుదలై హిట్లయ్యాయి. అలాగే తాజాగా 'సుల్తాన్'ను కూడా 'ఈద్' నాడు రిలీజ్ చేసి హిట్టుకొట్టి బాలీవుడ్ లో తనకు మరెవ్వరూ సరిలేరని నిరూపించుకుంటున్నాడు. ఇప్పుడు 'సుల్తాన్' బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే 105 కోట్ల రూపాయలను ఈ సినిమా వసూలు చేసిందంటే దీని హవాను అర్థం చేసుకోవచ్చు. లాంగ్ వీకెండ్ రావడం 'సుల్తాన్' కు కలిసివచ్చిందని బాక్సాఫీసు కలెక్షన్ల విశ్లేషకులు పేర్కొంటున్నారు. వాస్తవానికి బుధవారం రంజాన్ కావడంతో ఆ రోజే ఈ సినిమాను విడుదల చేశారు. అయితే చంద్రుడు కనిపించకపోవడంతో గురువారం రంజాన్ ను నిర్వహించారు. దీంతో ఈ రెండు రోజులు సినిమా హాళ్లు నిండిపోయాయి. శని, ఆది వారాలు సెలవేనన్న భావనతో ఎక్కువ మంది శుక్రవారం కూడా సెలవుగా తీసుకున్నారు. దీంతో సుదీర్ఘ వీకెండ్ ఈ సినిమాకు ప్లస్ అయింది. ఈ వారాంతం ముగిసే సరికి 'సుల్తాన్' 150 కోట్ల రూపాయలు కొల్లగొట్టి బాక్సాఫీసు రికార్డులను తిరగరాస్తుందని పలువురు పేర్కొంటున్నారు.