: ఐఎస్ఐఎస్ చీఫ్ ను కుక్కతో పోల్చి... నిప్పులు చెరిగిన అసదుద్దీన్ ఓవైసీ


జీహాద్ అంటూ నరమేధం సాగిస్తున్న ఐఎస్ఐఎస్ ముష్కరులపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాదు, దారుస్సలాంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో తీవ్రవాదం, ఉగ్రవాదంపై తీవ్ర స్థాయిలో ఆయన విరుచుకుపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా మానవ హననానికి పాల్పడి ఇస్లాం అంటే హింస, ఉగ్రవాదం, తీవ్రవాదం అనే ముద్రను వీరు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీహాద్ అంటూ సాటి ముస్లింల ప్రాణాలు తీస్తున్న ముష్కరులకు జీహాద్ అంటే ఏంటో అసలు అర్థం తెలుసా? అని అడిగారు. "జీహాద్ అంటే సేవ చేయడమని అర్థమని ఆయన స్పష్టం చేశారు. రండి, మా బస్తీల్లోకి రండి... ఇక్కడ జీహాద్ చెయ్యండి... జీహాద్ పేరిట మా పేద ముస్లింల ఆకలి మంటలు చల్లార్చండి. జీహాద్ పేరిట ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసి, వారు భర్తలతో సక్రమంగా కాపురం చేసుకునేలా సహాయం చెయ్యండి. జీహాద్ అంటే ఇస్లాం కోసం చావడం కాదు. ఇస్లాం కోసం జీవించడం. ఆదర్శంగా నిలవడం. ఇస్లాం కోసం ప్రపంచాన్ని నాశనం చేయడం జీహాద్ అనిపించుకోదని, ఉగ్రవాదం అనిపించుకుంటుంద"ని ఆయన స్పష్టం చేశారు. ఐఎస్ఐఎస్ వంటి ఉగ్రవాద సంస్థల చేష్టల కారణంగా ముస్లింల గొంతు వినిపించలేని పరిస్థితి దాపురించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులంటే మనుషులు కాదని, నరకం నుంచి వచ్చిన కుత్తేలోగ్ (కుక్కలు) అని ఆయన ఆగ్రహంతో రగిలిపోయారు. 'ఏదో ఒకరోజు అసలైన ముస్లిం నీ దగ్గరకు వస్తాడు. నీ శరీరాన్ని 100 ముక్కలుగా నరుకుతాడు' అంటూ ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ చీఫ్ అబూబకర్ బగ్దాదీని హెచ్చరించారు. భారతదేశం గొప్పదేశమని పేర్కొన్న ఆయన, క్లిష్ట సమయంలో ముస్లింలంతా ఐక్యంగా, శాంతియుతంగా ఉండాలని సూచించారు. సూఫీ, షియా, దేవ్ బందీ, బర్వేలీ ముస్లింలలోని వర్గాలన్నీ ఏకమై ఐఎస్ఐఎస్ ను అంతమొందించాలని ఆయన పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News