: అనంత్ అంబానీని పూర్తిగా మార్చేసింది తెలుగు వ్యక్తే...!


అనంత్ అంబానీని రెండేళ్ల క్రితం చూస్తే... చాలా మంది 'ఏమిటీ వెయిట్?' అనుకుని ఆశ్చర్యపడేవారు. మరి కొందరైతే జోకులు వేసేవారు. తన చుట్టూతా ఫిట్ నెస్ తో ఆకట్టుకునే క్రికెటర్లు, బాలీవుడ్ నటులు ఉండడంతో లోలోపల అతను కూడా తన పర్శనాలిటీ చూసుకుని ఫీలయ్యేవాడు. దీంతో తన బాడీని సమూలంగా మార్చుకోవాలని భావించి, తల్లితో చెప్పాడు. దీంతో నీతా అంబానీ బాలీవుడ్ లో ప్రముఖ ఫిట్ నెస్ ట్రైనర్ గా పేరొందిన తెలుగు వాడైన వినోద్ చెన్నాను సంప్రదించారు. జాన్ అబ్రహాం, శిల్పాశెట్టి వంటి వారంతా వినోద్ దగ్గరే ఫిట్ నెస్ కిటుకులు నేర్చుకుని సీడీలు విడుదల చేశారు. దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వినోద్ చెన్నా యువకుడిగా ఉండగా పీలగా ఉండేవాడు. దీంతో మంచి శరీర సౌష్ఠవం సంపాదించుకునేందుకు చాలా కష్టపడ్డాడు. ఈ క్రమంలో మిస్టర్ ముంబై, మిస్టర్ గుడ్ గావ్, మిస్టర్ మహారాష్ట్ర రన్నరప్ వంటి టైటిళ్లు సాధించాడు. అలాంటి ఇతనికి నీతా అంబానీ 208 కేజీల బరువున్న అనంత్ అంబానీని అప్పగించారు. దీంతో అతని ఆహారపుటలవాట్లపైనా, భారీకాయంతో వచ్చే ఇబ్బందులపైనా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఒళ్లును తగ్గించే పధ్ధతి కోసం అన్వేషించారు. దీంతో అతని ఆహారంలో ప్రొటీన్లు, ఫైబర్‌, తక్కువ మొత్తంలో కార్బొహైడ్రేట్లు ఉండేట్లు చూశారు. దీనికోసం కూరగాయలు, మొలకెత్తిన విత్తనాలు, కాటేజ్‌ చీజ్‌, కాయధాన్యాలు, పప్పులు, అర టీస్పూన్‌ నెయ్యి ఇచ్చేవారు. వీటి నుంచి కొలత ప్రకారం 1200-1400 కేలరీలు మాత్రమే శరీరానికి అందేట్లు జాగ్రత్త పడ్డారు. ఈ ట్రైనింగ్ మొత్తం కాలంలో జంక్‌ ఫుడ్‌ అన్న మాటెత్తకుండా చూశారు. ప్రతి రోజూ 30 నిమిషాల నుంచి 2 గంటల నడక ఉండేలా చూశారు. పిక్కలు, తొడలు పట్టేయకుండా ఉండేందుకు ఇంకొన్ని వ్యాయామాలు చేయించేవారు. ఇవి చేసేందుకు అనంత్ చాలా ఇబ్బంది పడేవాడు. అలవాటైపోయాక అన్నీ చేయడం మొదలుపెట్టాడు. అనంత్‌ ప్రతిరోజూ ఎంతో కొంత బరువు కచ్చితంగా తగ్గాల్సిన పరిస్థితి. అయినప్పటికీ అర్ధరాత్రి వరకు ఉండే కార్యక్రమాలు, హార్మోన్లలో మార్పుల కారణంగా కొన్ని సందర్భాల్లో రోజుకు 300 గ్రాముల బరువు పెరిగేవాడని ఆయన తెలిపారు. దీంతో తన డైట్ కాస్త మార్చమని అడిగాడు. మనోనిబ్బరంతో మరికొంత శ్రమ పడి 18 నెలల్లో 208 కేజీల నుంచి 100 కేజీలకు వచ్చాడని వినోద్ చెన్నా తెలిపారు. ఈ వ్యాయామాలతో శరీరం మొద్దుబారకుండా, నాజూగ్గా ఉండడానికి 16 రకాల ఫిట్‌నెస్‌ టెక్నిక్‌ లను వాడామని ఆయన చెప్పారు. 21 కిలోమీటర్ల నడక, తర్వాత యోగా వెయిట్‌ ట్రైనింగ్‌, ఫంక్షనల్‌ ట్రైనింగ్‌, హై ఇంటెన్సిటీ కార్డియో వ్యాయామాలు వంటివి చేయించేవారమని ఆయన చెప్పారు. ఇందులో డాక్టర్ ఆండ్రీ చిమోన్ సలహాలు, సూచనలు ఎంతో ఉపయోగపడ్డాయని ఆయన తెలిపారు. ఇంత కష్టపడడం వల్లే అనంత్ అంబానీ నాజూగ్గా, నవ యువకుడిలా మారాడని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News