: 14 ఏళ్లు ఉద్యమం ద్వారా పోరాడాం, ఎన్నికల్లో గెలిచాం.. మీలాకాదు: కాంగ్రెస్‌పై హరీశ్‌రావు ఆగ్రహం
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తోన్న అంశంపై, ఇటీవల హైదరాబాద్‌లో కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి హరీశ్‌రావు ఈరోజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ పాలనపై దిగ్విజయ్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. దిగ్విజయ్ కుటుంబమంతా ప్రజాప్రతినిధులే అని ఆయన వ్యాఖ్యానించారు. 14 ఏళ్లు తెలంగాణ ఉద్యమంలో పోరాడి, ఆ తరువాత ఎన్నికల్లో గెలిచామని హరీశ్ పునరుద్ఘాటించారు. ‘దిగ్విజయ్ కుటుంబ సభ్యుల్లా మేము నామినేట్ కాలేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజా ప్రతినిధులను కొనే చరిత్ర కాంగ్రెస్‌దేనని ఆయన అన్నారు. 2014లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను దిగ్విజయ్ సమక్షంలోనే కాంగ్రెస్‌లోకి చేర్చుకున్నారని హరీశ్‌రావు అన్నారు. ఇందిరా గాంధీ నుంచి పీవీ వరకు అందరూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన వారేనని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతోన్న ప్రాజెక్టులను అడ్డుకోవాలని కాంగ్రెస్ కుట్ర పన్ని తమపై ఆరోపణలు చేస్తోందని హరీశ్ రావు అన్నారు. ఎన్ని అడ్డంకులెదురైనా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి తెలంగాణలో కోటి ఎకరాలకు నీరందించి తీరుతామని ఆయన పేర్కొన్నారు.