: రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనూ కరవును తరిమేయాలంటే మొక్కలు నాటాలి: మంత్రి తలసాని
తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో రాష్ట్ర ప్రజలందరూ పాల్గొనాలని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. ఈరోజు హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని ఆకుపచ్చగా చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఎల్లుండి హెచ్‌ఎండీఏ పరిధిలో తాము పెద్ద ఎత్తున మొక్కలు నాటనున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం మీద కరవు పోవాలంటే మొక్కలు నాటాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. వర్షాలు లేక గత ఏడాది నగర ప్రజలు తాగునీటి కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డారని ఆయన అన్నారు. పెద్ద ఎత్తున చెట్లు నాటి వర్షాలు కురిసేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.