: చంద్రబాబు ఆహ్వానానికి చైనా ఓకే!...ఏపీలో పరుగులు పెట్టనున్న ‘డ్రాగన్’ హైస్పీడ్ రైళ్లు!
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఇటీవల చైనాలో జరిపిన పర్యటన ఫలితాలనిస్తోంది. ఒకరిద్దరు మంత్రులు, అధికారుల బృందంతో కలిసి చైనా వెళ్లిన చంద్రబాబు ఏకంగా ఐదు రోజుల పాటు ఆయన అక్కడ పర్యటించారు. ఈ సందర్భంగా చైనాకు చెందిన పలు ప్రైవేటు కంపెనీలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలతోనూ ఆయన చర్చలు జరిపారు. ఈ క్రమంలో చైనా రైల్వే కన్ స్ట్రక్షన్ కార్పొరేషన్ (సీఆర్సీసీ) అధికారులతోనే ఆయన భేటీ అయ్యారు. ఏపీలోనూ హైస్పీడ్ రైళ్లను నడపాలని ఆ సందర్భంగా ఆయన వారి వద్ద ప్రతిపాదించారు. చంద్రబాబు ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించిన సీఆర్సీసీ అధికారులు త్వరలోనే తమ వైఖరి వెల్లడిస్తామని చెప్పారు. చంద్రబాబు పర్యటన ముగిసి పది రోజులు కూడా కాలేదు... అప్పుడే సీఆర్సీసీ నుంచి స్పందన వచ్చింది. ఏపీలో తమ హైస్పీడ్ రైళ్లను నడిపేందుకు సిద్ధంగానే ఉన్నట్లు సీఆర్సీసీ అధికారులు తెలిపారు. ఈ మేరకు త్వరలోనే విజయవాడకు రానున్నట్లు వారు సమాచారం పంపారు.