: పాతబస్తీలో 400 మంది పోలీసులతో కార్డ‌న్‌సెర్చ్‌


హైద‌రాబాద్‌ పాత‌బ‌స్తీలోని హ‌స‌న్‌న‌గ‌ర్‌లో ఈరోజు తెల్ల‌వారుజామున పోలీసులు కార్డ‌న్‌సెర్చ్ (ముట్టడి-తనిఖీ) నిర్వ‌హించారు. దక్షిణ మండల డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో జ‌రిగిన ఈ దాడులలో 400 మంది పోలీసులు పాల్గొన్నారు. త‌నిఖీల్లో భాగంగా భారీగా వాహ‌నాల‌ను స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేని 47 ద్విచక్రవాహనాలు, 10 ఆటోలు, 3 కార్లను స్వాధీనం చేసుకున్న‌ట్లు పోలీసులు తెలిపారు. ప‌లువురి ఇంట్లో క‌నిపించిన 4 వేట కొడ‌వ‌ళ్లు, 280 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న‌ట్లు పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో 18 మంది అనుమానితుల‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్ర‌స్తుతం వారిని విచారిస్తున్నారు. వీరితో పాటు 9 మంది రౌడీ షీట‌ర్లను అదుపులోకి తీసుకున్నారు. ప‌శ్చిమ‌బెంగాల్‌కు చెందిన మ‌రో ఐదుగురిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వారి వ‌ద్ద‌ పాత మొబైల్‌ ఫోన్లు, భారీగా వైర్లు, టిఫిన్ బాక్సులు ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. ఈ ఐదుగురు అనుమానితులు జంట హత్యల కేసులో నిందితుడు రౌడీషీటర్‌ మాజిద్‌ ఇంట్లో క‌నిపించిన‌ట్లు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News