: జమ్ము కశ్మీర్‌లో కర్ఫ్యూ.. అమర్‌నాథ్ యాత్ర రద్దు
జమ్ముకశ్మీర్‌లో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ ముజాఫర్ వని(21) ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఎటువంటి అల్లర్లు రేకెత్తకుండా పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. పుల్వామా జిల్లాతోపాటు శ్రీనగర్‌లోని కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ లాంటి ఆంక్షలు విధించారు. మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అమర్‌నాథ్ యాత్రను రద్దుచేశారు. వని ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ర్యాలీలు నిర్వహించకుండా పలువురు హురియత్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. సంపన్న కుటుంబంలో జన్మించిన వని చిన్న వయసులోనే ఉగ్రవాదంవైపు మళ్లాడు. హిజ్బుల్ ముజాహిదీన్‌లో చేరి అంచెలంచెలుగా ఎదిగి కమాండర్ స్థాయికి చేరాడు. సోషల్ మీడియాను ఉపయోగించుకోవడంలో సిద్ధహస్తుడైన వనీ ఫేస్‌బుక్, వాట్సాప్‌ల ద్వారా చదువుకున్న యువతను ఉగ్రవాదంవైపు ఆకర్షించేవాడు. ఇస్లాం మతబోధకుడు జకీర్ నాయక్‌కు మద్దతుగా ట్వట్టర్‌లో పోస్టు చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే భద్రతా దళాల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు.