: మాట నిలుపుకున్న చంద్రబాబు!... అమరావతికి మరో రైలు వచ్చేసింది!
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఇటీవల ఇచ్చిన ఓ మాటను నిలుపుకున్నారు. ఫలితంగా నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి మరో కొత్త రైలు వచ్చేసింది, అనంతపురం జిల్లా ధర్మవరం, అమరావతి మధ్య పరుగులు పెట్టనున్న ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు... రాయలసీమ ప్రాంత ఉద్యోగులు, ప్రజలకు వరప్రదాయనిగా మారనుంది. వివరాల్లోకెళితే... బీజేపీ నేత, కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు ఏపీ కోటా నుంచి రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో ఇటీవల ఆయన విజయవాడకు రాగా, చంద్రబాబు ఆయనకు పసందైన విందు ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ఓ హామీ ఇచ్చారు. ‘‘రైల్వే మంత్రి సురేశ్ ప్రభుతో ప్రతి నెలా సమావేశమవుతాను. ప్రతి రెండు నెలలకు ఓ కొత్త రైల్వే ప్రాజెక్టును తీసుకువస్తాను’’ అని ఆయన నాడు ప్రకటించారు. అనుకున్నట్లుగానే ఇప్పటికే హైదరాబాదు- అమరావతి ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలును సాధించారు. ఈ రైలు ప్రారంభమైందో, లేదో ధర్మవరం- అమరావతి రైలును కూడా సురేశ్ ప్రభు ప్రకటించారు. వచ్చే మంగళవారం ఈ రైలును సురేశ్ ప్రభు ఢిల్లీ నుంచే రిమోట్ కంట్రోల్ సాయంతో ప్రారంభిస్తారు. వారానికి మూడు రోజులు (సోమ, బుధ, శని) వారాల్లో విజయవాడనుంచి బయలుదేరి అమరావతి మీదుగా ధర్మవరం చేరే ఈ రైలు... ఆ మరుసటి రోజుల్లో తిరిగి ధర్మవరం నుంచి అమరావతి వెళుతుంది. ఈ రైలుకు సంబంధించిన టైం టేబుల్, నెంబర్లను రెండు రోజుల్లో ప్రకటించనున్నారు.