: కేసీఆర్ తనయ బాటలో నారా లోకేశ్!... ‘ఢిల్లీలో మకాం’కు టీడీపీ యువ నేత సిద్ధం!


టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూతురుగానే కాకుండా ఆ పార్టీ ఎంపీగా కల్వకుంట్ల కవిత ఢిల్లీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన పలు ప్రయోజనాలను రాబట్టే విషయంలో ఆమె సఫలీకృతమవుతూనే ఉన్నారు. అవసరమైనప్పుడల్లా కేంద్ర మంత్రులతో భేటీ కావడంతో పాటు పలువురు జాతీయ స్థాయి నేతలకు విందులిస్తూ ఆమె తనదైన శైలిలో దూసుకెళుతున్నారు. తాజాగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కుమారుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్... కవిత బాటలోనే అడుగులు వేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఏపీ తరఫున ఢిల్లీలో ఓ బ్రాండ్ అంబాసిడర్ తరహాలో చక్రం తిప్పేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఈ మేరకు నారా లోకేశ్ పక్కా ప్రణాళికే రచించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే తండ్రి తరహాలోనే హైదరాబాదులోని కుటుంబం కంటే విజయవాడలోని పార్టీ కార్యక్రమాల్లోనే అధిక కాలం గడుపుతున్న ఆయన ఇకపై నెలలో రెండు, మూడు రోజులు ఢిల్లీలో ఉండేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం హోదాలో ఆయన తండ్రికి కేంద్రం కేటాయించిన 1, జన్ పథ్ భవనానికి అధికారులు మరమ్మతులు చేస్తున్నట్లు సమాచారం. ఇల్లు సిద్ధం కాగానే ఆయన తన మకాంను ఢిల్లీకి మారుస్తారట. జాతీయ స్థాయి నేతలతో పాటు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తూ జాతీయ స్థాయి రాజకీయాల్లో మరింత మేర పరిచయాలు పెంచుకోవడమే లక్ష్యంగా ఆయన ముందుకు సాగనున్నారు. ఇక ఏపీకి కేంద్రం నుంచి విడుదల కావాల్సిన నిధులు, ఇతర ప్రయోజనాలపై ఎప్పటికప్పుడు కేంద్ర మంత్రులతో భేటీలు నిర్వహించాలని కూడా ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News