: మీడియా సమావేశానికి వచ్చిన మాల్యా!...అంతా బాగానే ఉందని కామెంట్!
బ్యాంకులకు వేలాది కోట్ల రుణాలను ఎగవేసి విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను ‘ఉద్దేశపూర్వక ఎగవేతదారు’గా భారత్ తేల్చేసింది. అంతకుముందే ఆయన పాస్ పోర్టును రద్దు చేసేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బ్రిటన్ రాజధాని లండన్ లో తలదాచుకుంటున్న మాల్యా... బహిరంగంగా తిరగడం కాస్తంత ఇబ్బందికర విషయమే. అయితే ఈ ఇబ్బందిని ఆయన ఏమాత్రం ఖాతరు చేయలేదు. నిన్నటిదాకా కేవలం విందులు, వినోదాల కోసం గుట్టుచప్పుడు కాకుండా క్లబ్బులు, పబ్బులకు వచ్చి పోతున్నారు. ఇటీవల అక్కడి భారత రాయబారి హాజరైన పుస్తకావిష్కరణకూ ఆయన హాజరయ్యారు. తాజాగా నిన్న లండన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఫార్ములా వన్ రేసుల్లో తన జట్టు ‘సహారా ఫోర్స్ ఇండియా’ జట్టుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ‘బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్’లో తన జట్టు మంచి ప్రదర్శన ఇవ్వనుందని, ఈ దఫా నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంటుందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలిచ్చిన మాల్యా... అంతా బాగానే ఉందని కూడా కామెంట్ చేశారు.