: ఢిల్లీలో చంద్రబాబు బసకు ‘1, జన్ పథ్’ కేటాయింపు!... సిద్ధం చేస్తున్న అధికార యంత్రాంగం!
నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబునాయుడు దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లిన సందర్భాల్లో అక్కడ ఉన్న ఏపీ భవన్ లోనే బస చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏపీకి ఢిల్లీలో అధికారిక విడిదిగా ఏపీ భవన్ ను ఏర్పాటు చేశారు. టీడీపీ హయాంలోనే ఆ భవనం సిద్ధమైంది. తాజాగా తెలుగు నేల రెండుగా విడిపోయింది. ఏపీ భవన్ తమకు మాత్రమే చెందినదిగా తెలంగాణ వాదిస్తోంది. ఈ క్రమంలో ఏపీ సీఎం హోదాలో ఢిల్లీకి వెళ్లే చంద్రబాబు బస కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉన్న ‘జన్ పథ్’లోని ఒకటో భవంతిని చంద్రబాబు కోసం కేంద్రం కేటాయించింది. ప్రస్తుతం ఈ భవంతికి అవసరమైన చిన్న చిన్న మరమ్మతులు జరుగుతున్నాయి. చంద్రబాబుకు కేటాయించనున్న ఈ భవంతిలో చంద్రబాబు సహా ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉండేందుకు అవకాశం ఉంది.