: కాపు కార్పొరేషన్ ఛైర్మన్ కు 400 కోట్ల రూపాయల బహుమతిని ఇచ్చారా?: చంద్రబాబుకు సీపీఐ నారాయణ సూటిప్రశ్న
కాపు కార్పొరేషన్ ఛైర్మన్ రామానుజయకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 400 కోట్ల రూపాయల విలువైన భూములు కట్టబెట్టారా? అని సీపీఐ నేత నారాయణ ప్రశ్నించారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ, తమిళనాడు రాజధాని చెన్నైలోని అమరలింగేశ్వర సదావర్తి సత్రానికి సంబంధించిన భూములు 471 ఎకరాలని అన్నారు. ఇందులో మెజారిటీ వాటా అన్యాక్రాంతమయ్యాయని ఆయన ఆరోపించారు. ఈ భూముల్లో 100 ఎకరాలను తమిళనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకుని సాప్ట్ వేర్ కంపెనీకి కట్టబెట్టిందని తెలిపారు. మిగిలిన భూములను ఇంకొందరు ఆక్రమించుకుని పట్టాలు పొందారని చెప్పారు. ఇవన్నీ పోగా అక్కడ మిగిలినవి 87 ఎకరాలని, వీటిని కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ కుమారుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన వేలంలో 23 కోట్ల రూపాయలకు కొనుక్కున్నామని చెబుతున్నారని ఆయన చెప్పారు. వేలం నిర్వహించాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుందని, అలా నింబంధనలు ఏవీ పాటించకుండా వందల కోట్ల విలువైన భూమిని ఎలా కట్టబెడతారని ఆయన ప్రశ్నించారు. వేలం ప్రకటన ఇవ్వకుండా, పబ్లిక్ ఆక్షన్ లేకుండా కోట్ల విలువైన భూములను ఎలా విక్రయిస్తారని ఆయన ప్రశ్నించారు. ఇదంతా ప్రభుత్వ అవినీతిలో భాగమని ఆయన చెప్పారు. పథకం ప్రకారం వేలం నాటకమాడి వందల కోట్లు విలువ చేసే భూమిని కారుచౌకగా అప్పజెప్పారని ఆయన ఆరోపించారు.