: 'పరుగెత్తండి... తెలివితేటలు పెంచుకోండి'... అంటున్న శాస్త్రవేత్తలు!


మెదడును చురుకుగా ఉంచుకోవడానికి ఏం చేయాలంటే, వ్యాయామం ఒక్కటే దానికి పరిష్కారం అంటూ అనాదిగా మన పెద్దలు చెబుతుంటారు. ఈ వ్యాయామంలో కూడా రకరకాలున్నాయి. అయితే, వీటిలో మెదడుకి పనికి వచ్చేది మాత్రం కేవలం 'పరుగు' ఒక్కటేనని తాజాగా జరిగిన రెండు పరిశోధనల్లో వెల్లడైంది. శరీరంలో కొవ్వు కరగడానికి, కండరాలు బలపడడానికి వ్యాయామం ఏదైనా సరిపోతుందేమో కానీ, తెలివితేటలు పెంచుకునేందుకు మాత్రం పరుగు ఒక్కటే సరైన వ్యాయామమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫిన్‌ ల్యాండ్‌ కు చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని శాస్త్రీయంగా నిరూపించగా, ‘సెల్‌ మెటబాలిజమ్‌’ పత్రిక తన తాజా సంచికలో కూడా దీనినే పేర్కొంది. ఈ రెండు పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు హై ఇంటెన్సిటివ్‌ ఇంటర్వెల్‌ ట్రేనింగ్ (హెచ్ఐటీ).. అంటే ఏరోబిక్స్‌ లాంటి వ్యాయామాలు చేయడం, రెసిస్టెంగ్‌ ట్రేనింగ్ (ఆర్ టీ), అంటే వెయిట్‌ లిఫ్టింగ్‌ లాంటి వ్యాయామాలు చేసిన వారి మెదళ్లలో కలిగిన మార్పులను అధ్యయనం చేశారు. వీరి మెదళ్లలో ఎలాంటి మార్పులు లేకపోవడం వారు గుర్తించారు. అనంతరం పరుగెత్తేవారి మెదళ్లను అధ్యయనం చేశారు. ఆశ్చర్యకరంగా వారిలో హిప్పోక్యాంపస్‌ ప్రక్రియ వేగవంతమై మెదడులోని కణాలు ఎంతో అభివృద్ధి చెందాయి. పాత కణాలు బలపడడమే కాకుండా కొత్త కణాలు కూడా పుట్టుకొచ్చాయి. దీంతో మెదడు చురుకుగా పని చేసేందుకు, జ్ఞాపకశక్తి, తెలివితేటలు పెరిగేందుకు పరుగే మంచి వ్యాయామమని వారు నిర్ధారించారు. సో, పరుగెత్తండి తెలివితేటలు పెంచుకోండి!

  • Loading...

More Telugu News