: జకీర్ ప్రసంగాలను పరిశీలిస్తున్నాం, ఉగ్రవాదానికి సంబంధించిన అంశాలను ఉపేక్షించబోం: రాజ్‌నాథ్‌సింగ్
ఇస్లాం మత బోధకుడు, ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జకీర్ నాయక్ ప్రసంగాలను కేంద్రం పరిశీలిస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈరోజు తెలిపారు. జకీర్ ప్రసంగాల సీడీలను తాము పరిశీలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వాటిని పరిశీలించిన తరువాత జకీర్‌పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఉగ్రవాద సంబంధిత అంశాలను తాము ఉపేక్షించబోమని ఆయన పేర్కొన్నారు. ఇటీవల బంగ్లాదేశ్‌లోని ఢాకాలో దాడులకి తెగబడిన ఉగ్రవాదుల్లో ఇద్దరు ఉగ్రవాదులు ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్ ప్రసంగాలను స్ఫూర్తిగా తీసుకొని దాడికి దిగినట్లు అధికారులు కనుగొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే మహారాష్ట్రలో ఫడ్నవిస్ ప్రభుత్వం ఈ అంశంపై ఆరా తీయాలని అధికారులను ఆదేశించింది. జకీర్ ప్రసంగాలపై నివేదిక సిద్ధం చేసి ఇవ్వాలని సూచించింది. జకీర్ ప్రసంగాలపై ఇప్పటికే బ్రిటన్, కెనడాల్లో నిషేధం ఉంది. ఆయన ప్రసంగాలు రెచ్చగొట్టే విధంగా ఉండడంతో ఆయా ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా ఢాకా దాడిలో జకీర్ ప్రసంగాల అంశం ప్రస్తావనకు రావడంతో కేంద్రం ఈ అంశంపై ఆగ్రహంగా ఉంది.