: మా వైఎస్ పథకాలను చంద్రబాబు, కేసీఆర్ గాలికి వదిలేశారు!: దిగ్విజయ్
కాంగ్రెస్ పార్టీ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కేసీఆర్ లు ఇప్పుడు పట్టించుకోవడం లేదని దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. వైఎస్ 67వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ, అవిభాజ్య రాష్ట్రానికి వైఎస్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులూ ప్రస్తుతం రైతు వ్యతిరేకులైపోయారని నిప్పులు చెరిగారు. అటు చంద్రబాబు, ఇటు కేసీఆర్ లు స్వప్రయోజనాల కోసమే చూస్తున్నారని ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశారని అన్నారు. కార్పొరేట్ సంస్థలపై వీరు చూపిస్తున్న ప్రేమలో ఇసుమంతైనా ప్రజా సంక్షేమంపై చూపడం లేదని మండి పడ్డారు. వైఎస్ జయంతి వేడుకల్లో టీఎస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క సహా పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.