: క్షణక్షణానికీ విస్తరిస్తున్న అమెరికా అల్లర్లు... తలపట్టుకుంటున్న అధికారులు!
అమెరికాలో తెల్లజాతీయులకు, నల్లజాతీయులకు మధ్య నెలకొన్న విభేదాలు తారాస్థాయికి చేరగా, వీటిని ఎలా అదుపు చేయాలన్న విషయమై అధికారులు తలపట్టుకుంటున్నారు. ఇటీవలి కాలంలో నల్లజాతివారిపై అమెరికా పోలీసుల దాడులు పెరిగాయని ఆరోపిస్తూ, చేపట్టిన నిరసన ర్యాలీలో రెచ్చిపోయిన ఆందోళనకారులు తుపాకులు పేల్చగా ఐదుగురు పోలీసులు మృత్యువాత పడి, మరో ఆరుగురికి బులెట్ గాయాలు అయిన సంగతి తెలిసిందే. ఆపై పోలీసులు ఎక్కడికక్కడ నల్లజాతివారి ఆందోళనలను అణగదొక్కుతుంటే, క్షణక్షణానికీ నిరసనలు విస్తరిస్తున్నాయి. డల్లాస్ లో ప్రారంభమైన నిరసనల పర్వం పక్క రాష్ట్రాలకు పాకుతోంది. పలు ప్రాంతాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు నిర్వహిస్తూ, పోలీసుల వైఖరిపై నిప్పులు గక్కుతున్నారు. అధ్యక్షుడు ఒబామా స్వయంగా కల్పించుకుని, నల్లజాతి వారిపైనే దాడులు అధికంగా జరుగుతున్నాయని వ్యాఖ్యానించడం కలకలం రేపగా, నిరసనల ఉద్యమం పెరిగేందుకు కూడా ఆయన మాటలు కారణమయ్యాయి. ఇది దేశంలోని నల్లజాతివారి సమస్య కాదని, మొత్తం అమెరికా జాతి సమస్యగా మారిందని, దీన్ని తక్షణం పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఇక డల్లాస్ లో మేయర్ మైక్ రావ్లింగ్స్ మాట్లాడుతూ, సమస్య పూర్తిగా సద్దుమణిగి, నిరసనలు చల్లారేంత వరకూ సాధారణ ప్రజలు బయటకు రావద్దని ప్రకటించారంటే, పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 9/11 ఉగ్రదాడి తరువాత, డల్లాస్ పరిధిలో పోలీసు అధికారులపై ఇంత పెద్ద దాడి, ప్రాణ హరణం ఇదే తొలిసారని అధికారులు అంటున్నారు. ఇక పోలీసులపై దాడులు చేసిన నల్ల జాతీయుల్లో షార్ప్ షూటర్లు ఉండటం, వారు సరిగ్గా గురిపెట్టి తుపాకులతో పోలీసులపైనే విరుచుకుపడటంతో సంఘ విద్రోహ శక్తులు నిరసనల్లో చొరబడ్డాయని, ప్రజలు సంయమనం పాటించాలని అధికారులు కోరుతున్నారు.