: అబద్ధాలు రాస్తే ఈ కంప్యూటర్ ప్రోగ్రామ్ పట్టేస్తుంది!


ఒక వ్యక్తి మాట్లాడే తీరు, చెప్పే మాటల ఆధారంగా అబద్ధం చెబుతున్నాడా? లేక నిజం చెబుతున్నాడా? అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. కానీ, ఈ-మెయిల్ లో అబద్ధాలు రాస్తే, ఎంత వరకు గుర్తించగలము, సాధ్యమయ్యే పనేనా అనిపిస్తుంది. కానీ, లండన్ సిటీ యూనివర్శిటీ పరిశోధకులు మాత్రం అది సాధ్యమేనని అంటున్నారు. ఈ-మెయిళ్లలో, సోషల్ మీడియా వెబ్ సైట్ల ప్రొఫైళ్లు, వీసా అప్లికేషన్ లో అబద్ధాలు రాస్తే తాము రూపొందించిన సరికొత్త కంప్యూటర్ ప్రోగ్రాం వెంటనే పట్టేస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఆన్ లైన్ మోసాలకు కారణమయ్యే ఈ-మెయిళ్లను సులభంగా గుర్తించేందుకు, దరఖాస్తుల క్లియరెన్స్ కు ఈ ప్రోగ్రాం ఎంతగానో ఉపయోగపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. వాక్యాల నిర్మాణాన్ని విశ్లేషించి అందులో ఏమైనా అబద్ధాలుంటే తాము రూపొందించిన అల్గారిథమ్ గుర్తిస్తుందని, తప్పులున్నా పసిగడుతుందని పేర్కొన్నారు. అబద్ధాలు రాసే వారు వినియోగించే పదాలు, సరైన సమాచారం రాసే వారు వినియోగించే పదాలతో పోలిస్తే భిన్నంగా ఉంటాయని చెప్పారు. తప్పుడు సమాచారమిచ్చే వారు నేను, మేము, నాది లాంటి పదాలను వాడేందుకు ఇష్టపడరని, బ్రిలియంట్, గ్రేట్, ఎక్స్ లెంట్ లాంటి పదాలను ఎక్కువగా వినియోగిస్తుంటారని పేర్కొన్నారు. కేవలం ఈ పదాలు మాత్రమే కాకుండా ఇంకా చాలా తేడాలున్న వాక్యాలు కూడా వారు రాస్తుంటారని అన్నారు. కొన్ని వేల ఈ-మెయిళ్లను విశ్లేషించిన తర్వాతే తాము ఈ కంప్యూటర్ ప్రోగ్రామ్ ను కనుగొన్నామని సిటీ యూనివర్శిటీ పరిశోధకులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News