: మా పాలిట అల్లు అరవింద్ నిజంగా విలన్!: సినీ నటుడు రానా
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తమ పాలిట విలన్ అని ప్రముఖ నటుడు దగ్గుబాటి రానా అన్నాడు. ఈ వ్యాఖ్యలు చేసింది ఎక్కడో కాదు... సింగపూర్ లో ఇటీవల జరిగిన సైమా అవార్డ్స్ ఫంక్షన్ లో. ‘బాహుబలి’ చిత్రంలో రానా నటనకు గాను ఉత్తమ విలన్ అవార్డు లభించిన విషయం తెలిసిందే. ఈ అవార్డును రానాకు అల్లు అరవింద్ అందజేశారు. అవార్డు అందుకున్న అనంతరం రానా మాట్లాడుతూ, రియల్ విలన్ అయిన అల్లు అరవింద్ నుంచి ఈ అవార్డు అందుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందనడంతో అక్కడే ఉన్న మెగాస్టార్ చిరంజీవి సహా అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత రానా అసలు విషయం చెబుతూ, చిన్నప్పుడు రాంచరణ్, తను ఇద్దరూ ఒకే స్కూల్ లో చదివామని, క్లాస్ మేట్స్ మని, తామిద్దరం స్కూల్ కి డుమ్మా కొట్టినా, పరీక్ష రాయకపోయినా అల్లు అరవింద్ కు వెంటనే తెలిసి పోయేదని చెప్పాడు. ఈ విషయాన్ని అల్లు అరవింద్ అందరికీ చెప్పేవారని, దీంతో తమ పరిస్థితి తలెత్తుకోలేకుండా ఉండేదని, అందుకే, చరణ్ కు, తనకు అరవింద్ అంటే భయమని, ఆయన తమ పాలిట విలన్ అంటూ నాటి విషయాలను రానా గుర్తు చేసుకున్నాడు.