: చిత్తూరు జైలుకు వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి... 15 రోజుల రిమాండ్
గత రాత్రి చిత్తూరు జిల్లా సబ్ కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసనకు దిగిన ఘటనలో చంద్రగిరి వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కోర్టు 15 రోజుల రిమాండ్ విధించింది. నిన్న ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ ఉదయం పుత్తూరు కోర్టులో హాజరు పరచగా, న్యాయమూర్తి చెవిరెడ్డికి రిమాండ్ విధించారు. ఆ వెంటనే పోలీసులు ఆయన్ను చిత్తూరు జైలుకు తరలించారు. కేవలం స్టేషన్ బెయిలు ఇవ్వదగ్గ ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించిన తీరు హేయమని ఎంపీ మిథున్ రెడ్డి విమర్శించారు. చెవిరెడ్డిపై చంద్రబాబు సర్కారు కక్షకట్టిందని ఆయన నిప్పులు చెరిగారు. అక్రమంగా కేసులు బనాయించి వేధిస్తోందని, పోలీసులు ప్రభుత్వ కనుసన్నల్లో ఉంటున్నారని ఆరోపించారు.