: సక్రమంగా పన్నులను చెల్లించడం లేదా... ఐటీ శాఖ మీ పిల్లలతో చెప్పిస్తుంది!
ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను మీరు సక్రమంగా చెల్లించడం లేదా? మీ పిల్లలు మీ దగ్గరికి వచ్చి "నాన్నా నువ్వు ఇన్ కంటాక్స్ కట్టడం లేదటగా? నువ్వు జైలుకు పోతావా?" అని అడిగితే ఆశ్చర్యపోకండి. ఎందుకంటే, పన్ను ఎగవేతదారుల జాబితాను పక్కాగా సిద్ధం చేసుకుంటున్న ఆదాయపు పన్ను శాఖ అధికారులు, ఇప్పుడు వారి చిన్నారులకు పన్ను చట్టాలపై పూర్తి సమాచారాన్ని చెప్పాలని భావిస్తున్నారు. అందుకోసం ఎగవేతదారుల పిల్లలు అత్యధికంగా విద్యను అభ్యసించే స్కూళ్లు వెతికి మరీ అక్కడికి వెళ్లి చిన్నారులకు పన్ను పాఠాలను బోధించనున్నారు. ఇందుకోసం పూర్తి స్థాయి యాక్షన్ ప్లాన్ ఇప్పటికే సిద్ధమైంది. అధికారులు బ్యాచ్ లుగా విడిపోయి, స్కూళ్లలో ఉదయం పూట స్కూల్ అసెంబ్లీల సమయంలో విద్యార్థులను కలుస్తారు. ఇందుకోసం ఐటీ శాఖలోని యువ ఉద్యోగులను ఎంపిక చేశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, పన్ను ఎగవేతదారులు ఎదుర్కొన్న సమస్యల కథలను వారికి చెప్పి, చివరిగా మీ నాన్న కూడా పన్ను కట్టడం లేదని చెబుతారు. పన్ను చెల్లింపుల వల్ల రూపాయి ఎలా బలపడుతుంది, చెల్లించకుంటే జరిగే నష్టాలను వివరిస్తారు. ప్రధానంగా కాలేజీ స్థాయిలోని విద్యార్థులే ఐటీ శాఖ లక్ష్యంగా అధికారులు వెల్లడించారు. కాబట్టి పన్ను ఎగవేతదారులు ఇకపై మరింత మరింత జాగ్రత్తగా ఉండాలి మరి.