: చంద్రబాబు భుజంపై చెయ్యేసి మరీ గవర్నర్ గుసగుసలు!
తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం చంద్రబాబు భుజంపై చెయ్యేసి మరీ గుసగుసలాడిన ఘటన మరో కొత్త చర్చకు తెరతీసింది. నిన్న రాష్ట్ర తాత్కాలిక సచివాలయాన్ని సందర్శించేందుకు నరసింహన్ వచ్చిన వేళ ఈ ఘటన జరిగింది. మీడియా సమావేశం తరువాత అక్కడి నుంచి వెళ్లే ముందు, బాబు భుజంపై చెయ్యేసి, మరో చేతిని తన నడుంపై ఉంచుకొని కొన్ని అడుగులు నడిచిన గవర్నర్, ఆయనతో ఏదో చెప్పారు. దీనికి చంద్రబాబు సైతం నవ్వుతూ సమాధానం ఇచ్చారు. అంతకుముందు మీడియా సమావేశంలో ఓ విలేకరి, సచివాలయానికి గవర్నర్ రావచ్చా? అని ప్రశ్నించగా, అత్తారింటికి దారేది? అనే చిత్రం తెలుగులో వచ్చిందని చెబుతూ, అత్తారింటికి దారి చూపడం తప్పా? అని అడిగారు. 'వస్తే వచ్చానంటారు, రాకుంటే తెలంగాణలోనే ఉన్నానని చెబుతుంటారు. అంతా మీడియానే రాసుకుంటుంది' అని జోకేసి అందరినీ నవ్వించారు. ఇక చంద్రబాబు చెవిలో నరసింహన్ ఏం చెప్పారు? దానికి బాబు ఏం బదులిచ్చారన్నది వారిద్దరికే తెలుసు.