: ‘నెపార్టక్’ ఎఫెక్ట్.. చైనాలో 341 రైళ్లు రద్దు
నెపార్టక్ రూపంలో టైఫూన్ ముంచుకొస్తున్న నేపథ్యంలో చైనా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా 341 రైళ్లను రద్దుచేసింది. ఇప్పటికే వరదల్లో చిక్కుకుని అల్లాడిపోతున్న ప్రజలకు నెపార్టక్ టైఫూన్ వార్త మరింత భయభ్రాంతులకు గురిచేస్తోంది. రేపు ఉదయం ఫుజియాన్ తీర ప్రాంతాన్ని టైఫూన్ తాకే అవకాశాలున్నాయి. నెపార్టక్ ప్రభావంతో ఫుజియాన్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాలలో భారీ వర్షాలు కురవనున్నాయి. దీంతో ఫుజియాన్-తైవాన్ మధ్య బల్లకట్టు రవాణాను నిలిపివేయాలని రవాణాశాఖ అధికారులు ఆదేశించారు. అలాగే ఫుజియాన్, గువాంగ్‌డాంగ్, ఝెజియాంగ్ రేవుల్లో చేపల వేటను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం వరదల్లో చిక్కుకున్న చైనాను నెపార్టక్ మరింత అతలాకుతలం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా వరకు నదులు, వాగులు వంకలు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. 1.84 మిలియన్ల మందిని ఇప్పటి వరకు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 5,60,500 హెక్టార్లలోని పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వరదల కారణంగా రూ.58 వేల కోట్ల(8.6 బిలియన్ డాలర్లు) నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.