: బెంగళూరులో నాలుగు లక్షల ఏళ్ల క్రితమే మనిషి జీవించిన ఆనవాళ్లు.. పరిశోధనలో వెల్లడి


ఐటీ రాజధానిగా, గార్డెన్ సిటీగా పేరుగాంచిన బెంగళూరులో నాలుగు లక్షల సంవత్సరాల క్రితమే మానవులు జీవించారా?.. అంటే అవుననే అంటున్నాయి తాజా పరిశోధనలు. మొట్టమొదటి సారిగా ఇక్కడ రాతియుగం నాటి ఆనవాళ్లు బయటపడ్డాయి. ప్రస్తుతం బెంగళూరు ఉన్న చోటనే రాతియుగం నాటి ఆనవాళ్లు లభ్యమైనట్టు మంగళూరు యూనివర్సిటీకి చెందిన పురాతత్వ శాస్త్రవేత్త, చరిత్రకారుడు డాక్టర్ కేబీ శివతారక్ పేర్కొన్నారు. ఈ ఏడాది మే నెలలో కదిరెనహళ్లి సమీపంలో వాటర్ లీకేజీ మరమ్మతుల కోసం రోడ్డు తవ్వుతుండగా కొన్ని రాళ్లు బయటపడ్డాయి. ఆ సమీపంలోనే నివసించే శివతారక్ దృష్టిని ఆ రాళ్లు ఆకర్షించాయి. వాటిని తీసుకెళ్లి శుభ్రపరిచిన ఆయన అవి రాతియుగం నాటి మనుషుల పనిముట్లని నిర్ధారించుకున్నారు. గతంలో ఇటువంటి రాతి పనిముట్లనే తుముకూరు, మాండ్య, చిత్రదుర్గ జిల్లాల్లో ఆయన కనుగొన్నారు. శివతారక్ కనుగొన్న ఐదు పనిముట్లలో ఒకటి చేతి గొడ్డలి, చిన్న కత్తిలాంటి సాధనం, ఆకులా ఉండే పనిముట్టు, రాతి సుత్తి, చిన్న చేతి గొడ్డలి ఉన్నాయి. క్వార్ట్జ్ రాయితో తయారైన ఇవి 7-11 సెంటీమీటర్ల పొడవు 4-7 సెంటీమీటర్ల వెడల్పు ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. అప్పట్లో వేట అనేది మనుషుల ప్రధాన వృత్తి కావడంతో ఈ ఆయుధాలను వివిధ రకాలుగా ఉపయోగించే వారని శివతారక్ తెలిపారు. ప్రస్తుతం బెంగళూరు ఉన్న ప్రాంతానికి రాతియుగం నాటి మానవులు వలస వచ్చి ఉండొచ్చని కర్ణాటక యూనివర్సిటీ ఆర్కియాలజీ రిటైర్డ్ ప్రొఫెసర్ రవికోరి శెట్టర్ పేర్కొన్నారు. బెంగళూరు చుట్టపక్కల ఎక్కడా పాతరాతి యుగం నాటి ఆనవాళ్లు లేవన్నారు. ప్రస్తుతం తవ్వకాల్లో లభ్యమైనా క్వార్ట్జ్ రాయి నిల్వలు ఈ ప్రాంతంలో లేవని, ఉత్తరాదితోపాటు తుముకూరు సమీపంలోని కిబ్బనహళ్లిలో మాత్రమే ఉన్నాయని వివరించారు. దీనిని బట్టి చూస్తే పాతరాతి యుగం మానవులు సంచార జీవితంలో భాగంగా బెంగళూరు వచ్చి ఉండవచ్చని రవి కోరి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News